మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం | Sakshi
Sakshi News home page

మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం

Published Sat, Jun 24 2023 1:06 AM

- - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ) : సొంతంగా జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి వందశాతం రాయితీపై రూ. 3 లక్షల సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘గృహలక్ష్మి’ పథకం కింద మహిళా లబ్ధిదారులకే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కేటాయింపులను తక్కువ సంఖ్యలో కొనసాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రూ. 1.50 లక్షల వరకు సాయం అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గృహ నిర్మాణ సంస్థను ప్రభుత్వం ఎత్తివేసింది.

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేసిన ఉద్యోగులను వివిధ శాఖల్లో విలీనం చేశారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంను కొనసాగించారు. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించే పథకం తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 3 వేల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు ఉన్నాయి.

అంటే జిల్లాకు గృహలక్ష్మి పథకం కింద రూ.165 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసుకునేవారు స్థానికులై ఉండటమే కాకుండా తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు ఓటరై ఉండాలనే నిబంధన విధించారు. ఓటరు కార్డును దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంది. ఓటరు కాని వారికి గృహలక్ష్మి పథకం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది.

వరం కాదు భారమే..
గృహలక్ష్మి పథకం కింద అందే సాయం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌, ఇనుము, ఇటుకలు, ఇసుక ఇతరత్రా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం పేదలకు భారం అవుతుంది. రూ. మూడు లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం కష్టమని అందువల్ల సాయం విలువను పెంచాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. రెండు గదులు, బాత్‌రూం, టాయ్‌లెట్‌లను నిర్మించాలంటే కనీసం రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement