కాంగ్రెస్‌ గూటికి సునీల్‌ రెడ్డి, నర్సారెడ్డి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి సునీల్‌ రెడ్డి, నర్సారెడ్డి

Published Wed, Jun 28 2023 1:04 AM

- - Sakshi

శాసనసభ ఎన్నికల కౌంట్‌డౌన్‌ నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలోనూ జోష్‌ రెట్టింపవుతోంది. ఇదిలా ఉండగా టిక్కెట్ల ఆశావహుల ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. నిజామాబాద్‌ నుంచి వయా హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీ వరకు నాయకులు చక్కర్లు కొడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : వచ్చే నెల రెండోవారంలో రాష్ట్రంలో 50 నుంచి 55 వరకు అభ్యర్థులను మొదటి విడతగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బోధన్‌ నుంచి మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, జుక్కల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం పేర్లు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు పార్టీలో చేరికలు షురూ అయ్యాయి. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయం ఖరారైంది. సునీల్‌రెడ్డి ఈ నెల 26న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఓ హోటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే సునీల్‌రెడ్డి చేరిక ఖరారైంది.

రేవంత్‌తో సమావేశం అనంతరం పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో సునీల్‌రెడ్డి సమావేశమయ్యారు. వారం రోజుల్లో సునీల్‌ పార్టీ కుండువా కప్పుకోనున్నారు. ఇందుకు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వివిధ సర్వేల నేపథ్యంలో సునీల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ తరుపున పోటీ చేసిన సునీల్‌రెడ్డికి 40 వేల పైగా ఓట్లు వచ్చాయి. అయితే బాల్కొండ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం టిక్కెట్టును ఆశిస్తుండడం గమనార్హం.

● మరోవైపు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పొంగులేటి బృందంతో కలిసి ఈ నెల 25న ఢిల్లీ వెళ్లారు. అక్కడే నర్సారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నర్సారెడ్డికి మాత్రం టిక్కెట్టు విషయమై హామీ ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో రేవంత్‌రెడ్డితో కలిసి నర్సారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే 2018లో నర్సారెడ్డి చివరి నిముషం వరకు ఎమ్మె ల్యే టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. టిక్కెట్టు దక్కకపోవడంతో పార్టీ తరుపున ప్రచారానికి దూరంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికలు అయ్యాక, పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు తాజాగా పొంగులేటి బృందంతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాగా కాంగ్రెస్‌లో చేరికకు ముందే గత మూడు నెలల నుంచే నర్సారెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ టిక్కెట్టు కోసం రేవంత్‌రెడ్డిని అడుగుతున్నారు.

ఈ క్రమంలో సునీల్‌ కనుగోలు బృందం సర్వేలో భూపతిరెడ్డి, కాట్‌పల్లి నగేష్‌రెడ్డి, తాహెర్‌బిన్‌ హందాన్‌లతో పాటు అరికెల నర్సారెడ్డి పేరును చేర్చా రు. అయితే విడతలవారీ సర్వేలో భూపతిరెడ్డికే అత్యధిక మంది మద్దతు ఉన్నట్లు తేలింది. నర్సారెడ్డి విషయంలో కేవలం మూడు శాతం మాత్రమే మొగ్గు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ టిక్కెట్టును భూపతిరెడ్డికే కేటాయించనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ టిక్కెట్ల విషయంలో పార్టీ నాయకత్వం ఒక స్పష్టతకు రాకపోవడంతో ఉత్కంఠ కలిగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement