Sakshi News home page

చేపల వేటకు వెళ్లి పలువురి మృతి!

Published Sat, Jul 29 2023 1:00 AM

- - Sakshi

నిజామాబాద్‌: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామానికి చెందిన బక్కని సాయిలు(35) గురువారం చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతు అయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం చెరువుగట్టుపై చూడగా చెప్పులు, బట్టలు కనిపించాయి.

చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో మృతి చెందినట్లు మృతుని భార్య మౌనిక ఫిర్యాదు చేశారు. మృతుడికి కూతురు మనుస్మిత, కుమారుడు గంగాప్రసాద్‌ ఉన్నారు. టీసీసీసీ సభ్యుడు కాసుల బాలరాజు, బుడిమి సొసైటీ చైర్మన్‌ గంగుల గంగారాం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మల్కాపూర్‌ శివారులో ఒకరు

నవీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌ శివారులోని చెరువులో శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు. నిజామాబాద్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సిర్నాపల్లి సాయారెడ్డి(52) చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడని పేర్కొన్నారు. ఈత రాకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు కేసు నమోదు చేశామన్నారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

నల్లవాగు మత్తడి వరద నీటిలో గల్లంతైన జంగం కృష్ణ (48) మృత దేహం శుక్రవారం లభ్యమైందని ఎస్సై నాగగోని రాజు తెలిపారు. పిట్లంకు చెందిన జంగం కృష్ణ చేపల వేట కోసం నల్లవాగు మత్తడి దిగువన వాగు ఒడ్డుకు వచ్చాడు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణ నీటిలో కొట్టుకుపోయాడు. కృష్ణ కోసం గాలింపు చేపట్టగా గల్లంతైన ప్రదేశం నుంచి కిలోమీటర్‌ దూరంలో చెట్టు కొమ్మకు తట్టుకొని మృతదేహం లభ్యమైంది.

Advertisement
Advertisement