మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి

Published Mon, Nov 27 2023 12:46 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్‌ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్‌(బాల్కొండ)

ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా?
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం.

బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..?
► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్‌డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్‌ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం.

మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..?
► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం.

మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు?
► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే.
ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్‌ గాంధీ

Advertisement

తప్పక చదవండి

Advertisement