Sakshi News home page

ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు

Published Tue, Dec 19 2023 12:48 AM

- - Sakshi

స్నేహితుడి ఇంటిపై ఆశపడ్డాడు. ఎలాగైనా దానిని దక్కించుకోవాలనుకున్నాడు. మిత్రుడి అడ్డు తొలగించుకోవడం కోసం అతడి కుటుంబంలోని ఆరుగురికి మరణశాసనం లిఖించాడు. నమ్మించి ఒక్కొక్కరిని తీసుకెళ్లి హతమార్చాడు. ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డాననుకున్నాడు. కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న సదాశివనగర్‌ పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో తీగలాగారు. దీంతో డొంక కదిలింది. ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించిన వరుస హత్యల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సాక్షి, కామారెడ్డి: నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్‌ కుటుంబం కొన్ని సమస్యలతో ఊరును వదిలి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసు కుని నివాసం ఉంటున్నాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. భార్య గర్భంతో ఉంది. ఆయనతో తల్లి, ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉండేవారు.

ప్రసాద్‌కు తన స్వగ్రామానికి చెందిన ప్రశాంత్‌ మిత్రుడు. ఓ కేసు విషయంలో డబ్బులు అవసరం కాగా ప్రసాద్‌ తన ఇల్లు అమ్మాలనుకున్నాడు. ప్రశాంత్‌ ఆ ఇంటిని తానే కొంటానని చెప్పి కొంత డబ్బును అప్పట్లో ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తే బ్యాంక్‌ లోన్‌ తీసుకుని మిగతా డబ్బులు ఇస్తానని ప్రసాద్‌ను ఒప్పించాడు. కాలం గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్నేహితుడి అడ్డు తొలగించుకోవడానికి ప్రశాంత్‌ పక్కా ప్లాన్‌ వేశాడు.

గతనెల 28న ప్రసాద్‌ను నమ్మించి తీసుకువెళ్లి డిచ్‌పల్లి ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల తర్వాత ప్రసాద్‌ భార్యను నమ్మించి తీసుకువెళ్లి బాసరలో హతమార్చి గోదావరిలో తోసేశాడు. ఈనెల 9న ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి 44వ నంబరు జాతీయ రహదారిపై సోన్‌ బ్రిడ్జి సమీపంలో చంపి గోదావరిలో పడేశాడు. అనంతరం అన్న, వదినలు ఆపదలో ఉన్నారని చెప్పి ప్రసాద్‌ చెల్లెళ్లు ఇద్దరినీ తీసుకువెళ్లి చంపాడు. ఒకరిని చేగుంట సమీపంలో, మరొకరిని భూంపల్లి సమీపంలో చంపి దహనం చేసినట్టు భావిస్తున్నారు.

ఇలా వెలుగులోకి..
సదాశివనగర్‌ మండలం భూంపల్లి శివారులో ఈనెల 13న గుర్తుతెలియని యువతి మృతదేహం కనిపించింది. యువతి శవాన్ని దహనం చేసినట్టు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలిపోయిన శవం పాదాలు కాలకుండా ఉండడం, కాళ్లకు పట్టీలు ఉండడంతో యువతిగా భావించారు. ఎస్పీ సింధుశర్మ ఆదేశాలతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో ఎవరైనా హత్యకు గురై ఉంటారేమోనని ఆరా తీశారు. నిర్ధారణ కాకపోవడంతో ఆధారాల కోసం వెతికారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ రాత్రి నేరం జరిగిన ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల ఆచూకీ కనుగొన్నారు. వారిని విచారించడంతో వరుస హత్యల సంఘటన వెలుగులోకి వచ్చింది.

కిరాతకంగా చంపి..
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్యలు సినీ ఫక్కీలో జరిగాయి. నిందితుడు నమ్మించి వెంట తీసుకువెళ్లి, ఆ తర్వాత హతమార్చి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. హత్యలను పరిశీలిస్తే హంతకుడిలోని రాక్షస మనస్తత్వం భయంగొలుపుతుంది. పక్షం రోజుల వ్యవధిలో ఆరుగురిని చంపేశాడు. ఆరు హత్యలు జరగ్గా.. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు మాత్రమే లభించాయి. ప్రసాద్‌తోపాటు అతడి భార్య రమణి, మరో సోదరి స్రవంతి మృతదేహాలు ఇంకా లభించలేదు. నిందితుడు ప్రసాద్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం సమాచారాన్ని రికార్డు చేసి, ఆధారాలను సేకరించిన తర్వాత నిందితులను రిమాండ్‌కు పంపించే అవకాశాలున్నాయి.

Advertisement
Advertisement