అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి? | Sakshi
Sakshi News home page

అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి?

Published Tue, Mar 19 2024 10:19 AM

EB Gilmore Is The Original Farmers Market In Los Angeles - Sakshi

హాలీవుడ్ సినిమాలకు ప్రసిద్ధిగాంచిన లాస్‌ ఏంజిల్స్  మహానగరంలో నేను చూసిన ప్రదేశాల్లో నాకు సినిమా స్టూడియోల కన్నా కూడా బాగా నచ్చింది ఈబీ గిల్మోర్ ఫార్మర్స్ మార్కెట్. ఎందుకంటే..? నాకు వ్యవసాయ సహకార రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా పనిచేసిన అనుభవం ఉంది. ఎర్లీబెల్ గిల్మోర్ 1934 లో ప్రారంభించిన ఈ రైతుబజారులో వ్యవసాయ సంబంధమే కాదు అన్ని వస్తువులు పిల్లల ఆటవస్తువులు, గిఫ్ట్ ఐటమ్స్ (అవీ వారి ఉత్పత్తులేనంటారు ) వంటివి కూడా దొరకడం విశేషం. 

రుచికరమైన ఆహార పానీయాలు అందించే రెస్టారెంట్లకు లెక్కేలేదు. ఇక్కడికి వచ్చే జనం కొనుక్కుపోయే వాటికన్నా ఇక్కడ తినేవే ఎక్కువ. నేను గమనించిందేంటంటే, అమెరికన్లు తినేదానికన్నా వృధాగా పడేసేదే ఎక్కువ. పొద్దున్నుండి రాత్రివరకు పనిచేసే ఈ మార్కెట్ మామూలు రోజుల్లోనే కిటకిట లాడుతుంది, ఇక వీకెండ్స్లో చెప్పే పని లేదు. బయటి నుండి వచ్చే యాత్రీకుల రద్దీ కూడా ఎక్కువే. హాలీవుడ్ సినిమాల వాళ్ళు కూడా తరచుగా ఈ మార్కెట్ కు వస్తుంటారన్నది మరో ఆకర్షణ. 

ఈ ఫార్మర్స్ మార్కెట్ ప్రత్యేకత ఉత్పత్తిదారులే ఇక్కడ స్వయంగా తమ ఉత్పత్తులు అమ్ముకోవడం , ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయదారులు, అవి చౌక ధరలకు లభిస్తాయన్న వినియోగదారుల నమ్మకం. అంతేకాదు ఈ మార్కెట్‌కు సరాసరి ఫామ్ నుండి సరఫరా ఔతాయి కాబట్టి పండ్లు, కూరగాయలు తాజాగా ఉండడం. అమ్మకం దారుల మధ్య నున్న తీవ్రమైన పోటీవల్ల ఇక్కడ ఏది కొన్నా బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి.

అమెరికాలో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా మనకు లభించే కనీస సౌకర్యాలు పార్కింగ్, రెస్ట్ రూంలు, ఈ మార్కెట్లో ఏటీఎం, టెలిఫోన్ బూత్, పోస్ట్ ఆఫీసు వంటివి కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యం సందర్శకుల రక్షణ, ఎప్పుడు ఏ టెర్రరిస్ట్లు ఎటునుండి వచ్చి దాడి చేస్తారోనని అమెరికా వాళ్ళు నిరంతరం జాగ్రత్తగా ఉంటుంటారు, అది ఈ మార్కెట్లో స్పష్టంగా కనబడుతుంది.

ఇలాంటి రైతుల మార్కెట్లకు అమెరికాలో ఈ మధ్యకాలంలో గిరాకీ ఎక్కువ అవుతుందని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. డైరెక్ట్ సేల్స్ వృద్ధి 9.6 శాతం ఉందని ఆ దేశ వ్యవసాయశాఖ వారి గణాంకాలు తెలుపుతున్నాయి. 1994 నాటికి అమెరికాలో రిజిస్టరై నడపబడుతున్న రైతుబజార్లు 1744 కాగా, 2012 నాటికి వాటి సంఖ్య 7864కు చేరింది. ఇందుకు ముఖ్య కారణం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించబడిన ఆహారపదార్థాలతో విసిగిపోయినవారు ఆర్గానిక్ ఫుడ్స్ కోసం రైతు బజార్ల వైపు చూస్తున్నారట, ఇలాంటి వాటికి ఎక్కువ ధర అయినా చెల్లించడానికి వారు వెనకాడడం లేదట. 

మన దేశంలో మన రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రారంభించిన రైతు బజార్లలో రైతులకు బదులు దళారులు ఎక్కువగా కనిపిస్తారు. రైతులే తమ పంటలు అమ్ముకుంటారనుకుంటే అందులో కూడా సేంద్రియ, పర్యావరణ, జీవసంబంధ పంటల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు వారి స్థానాల్లో మధ్య దళారులు కాస్తా దుకాణాలను కబ్జా చేయడం, ఏది పడితే అది అమ్మడం  వల్ల బయటి మార్కెట్లకు వీటికి తేడా లేకుండాపోవడం.. ఇవన్నీ ఇక్కడి అనుభవాలు. మరి అమెరికాలో.. ఇలాంటి మార్కెట్లలో చాలా వసతులతో పాటు కొత్త విషయాలెన్నో ఉన్నాయి. ముందు ముందు మనం కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుందాం.
--వేముల ప్రభాకర్‌

Advertisement
Advertisement