భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు! | Sakshi
Sakshi News home page

భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!

Published Wed, Jul 20 2022 5:54 PM

Over 1.6 Lakh Indians Renounced Citizenship in 2021 - Sakshi

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపింది. గతేడాది 78,284 మంది ఇండియన్స్‌ అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశీ పౌరసత్వం వదులుకున్న వారిలో అమెరికా ఎన్నారైలే అత్యధికంగా ఉండటం విశేషం. 

ద్వంద్వ పౌరసత్వాన్ని మనదేశం అనుమతించదు. దీంతో విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ఒక దేశ పౌరసత్వం మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. కాగా, చైనాలో నివసిస్తున్న 362 మంది భారతీయులు కూడా స్వదేశీ సిటిజన్‌షిప్‌ను వదులుకుని చైనా పౌరసత్వం ఉంచుకున్నారు. 

వ్యక్తిగ కారణాల వల్లే స్వదేశీ పౌరసత్వాన్ని ప్రవాసులు వదులుకున్నారని  హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. లోక్‌సభలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం శాఖ 2018లో పౌరసత్వ నిబంధనలను సవరించింది. విదేశీ పౌరసత్వాన్ని పొందడం, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన కాలమ్‌ను దరఖాస్తులో పొందుపరిచింది. 

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల్లో 23,533 మంది, కెనడా నుంచి 21,597 మంది స్వదేశీ పౌరసత్వం వదులుకున్నారు. బ్రిటన్‌(14,637), ఇటలీ(5,986), నెదర్లాండ్స్ (2187), న్యూజిలాండ్( 2643), , సింగపూర్(2516), పాకిస్తాన్‌(41) నేపాల్(10) తదితర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాలను స్వీకరించారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో 103 దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఉన్నారని కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. (క్లిక్‌: రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్‌)

Advertisement
Advertisement