‘మద్దతు’తో భరోసా | Sakshi
Sakshi News home page

‘మద్దతు’తో భరోసా

Published Thu, Mar 16 2023 1:02 AM

కంకిపాడు మండలం వేల్పూరులో 
నూర్పిడికి సిద్ధంగా పెసర పంట - Sakshi

కంకిపాడు(పెనమలూరు): పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో దళారుల బారిన పడి రైతులు నష్టపోకుండా మద్దతు కల్పించి బాసటగా నిలిచేందుకు కొనుగోళ్ల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగింది. ప్రస్తుతం పెసర కొనుగోళ్లకు సన్నాహాలు పూర్తి చేసింది. రైతుభరోసా కేంద్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ద్వారా పంట కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటోంది.

సాగు ఇలా..

ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల హెక్టార్లలో మినుము పంట సాగు జరగ్గా, 10,016 ఎకరాల్లో పెసర పంట సాగు జరిగింది. 6,154 టన్నులు మేరకు పెసర దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ప్రధానంగా బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో అధిక విస్తీర్ణంలోనూ, కంకిపాడు, పెదపారుపూడి, ఉయ్యూరు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో మోస్తరుగానూ పెసర సాగు జరిగింది. పంట తీత పనులు పూర్తయ్యి నూర్పిడి పనులు వేగంగా జరుగుతున్నాయి. పంట మార్కెట్‌కు చేరుతోంది. అయితే పెసలు క్వింటా మద్దతు ధర రూ. 7,755గా ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌లో మాత్రం క్వింటా రూ. 7,400 నుంచి రూ. 7,500గా పలుకుతుంది. పెసర పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్క్‌ఫెడ్‌ పంట సాగు వివరాలు, దిగుబడి వివరాలను సేకరించింది. దిగుబడిలో 1500 టన్నులను రైతుల నుంచి సేకరించేందుకు లక్ష్యం నిర్దేశించుకుంది.

రిజిస్ట్రేషన్‌లకు అవకాశం..

పెసర కొనుగోలు చర్యల్లో భాగంగా పంట సాగు చేసిన రైతులు తమ పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకునేలా మార్క్‌ఫెడ్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రక్రియను బుధవారం నుంచి అధికారులు ప్రారంభించారు. ఆర్‌బీకేల్లోని వీఏఏ, వీహెచ్‌ఏల వద్ద పేర్లు నమోదు చేసుకుంటే నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి పంట సేకరించి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. పంట సాగు జరిగిన ప్రాంతాలను గుర్తించి 40 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఎనిమిది సెంటర్ల ద్వారా పెసలు కొనుగోలు చేపట్టనుంది. గన్నవరం పరిధిలోని పురుషోత్తమపట్నం సొసైటీ, ఉంగుటూరు పరిధిలోని కొయ్యగూరపాడు సొసైటీ, పొట్టిపాడు సొసైటీ, బాపులపాడు పరిధిలోని ఆరుగొలను సొసైటీ, కొత్తపల్లి సొసైటీ, కంకిపాడు, పెనమలూరు మండలం వణుకూరు, పెదపారుపూడిలో డీసీఎంఎస్‌ ద్వారా కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రభుత్వం పంట సేకరణకు ముందుకు రావటంతో మార్కెట్‌లో ధర పెరిగి తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పెసర కొనుగోళ్లకు సన్నాహాలు ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రక్రియ మినుముకూ అవకాశం

మద్దతు ధర అందించటమే లక్ష్యం..

పెసర పంట అధికంగా సాగు చేసిన ప్రాంతాలను గుర్తించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అవసరమైన సొసైటీ, డీసీఎంఎస్‌ కేంద్రాల ట్యాగింగ్‌ పనులు పూర్తి చేశాం. పెసరకు రూ. 7,755 క్వింటా మద్దతు ధర ఉంది. రైతులు నష్టపోకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా పంట సేకరణకు చర్యలు తీసుకున్నాం. మినుము రైతులు తమ పరిధిలో ధర తక్కువ ఉందని భావిస్తే ఆర్‌బీకేలను సంప్రదించి, వివరాలను నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడతాం.

– బి.మురళీకిషోర్‌, డీఎం, మార్క్‌ఫెడ్‌, కృష్ణాజిల్లా

మినుము రైతులకు ఇలా..

జిల్లాలో ఉన్న 323 రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకునేలా మార్క్‌ఫెడ్‌ చర్యలు తీసుకుంది. మినుము పంటకు క్వింటా మద్దతు ధర రూ. 6,600 నిర్ణయించింది. బయటి మార్కెట్‌లో రూ. 7 వేలు పైనే ధర పలుకుతోంది. రైతులు తమ తమ ప్రాంతాల్లో ధర తక్కువ ఉందని భావించి ఆర్‌బీకేలను సంప్రదిస్తే సేకరణకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు మార్క్‌ఫెడ్‌ ప్రణాళిక రూపొందించింది.

1/1

Advertisement
Advertisement