సీఎం పర్యటన విజయవంతం చేద్దాం | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన విజయవంతం చేద్దాం

Published Thu, Mar 16 2023 1:02 AM

సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రక్షణ నిధి, సీపీ టి.కె రాణా తదితరులు  - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/తిరువూరు: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19వ తేదీన తిరువూరు రానున్నారని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్‌ ఢిల్లీరావు అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యా దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు తిరువూరులో నిర్వహించనున్న సభను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మొదట ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారు చేయగా.. అనివార్య కారణాల వల్ల కార్యక్రమాన్ని 19వ తేదీ ఆదివారం నాటికి మార్పు చేశారన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసనమండలి సభ్యుడు తలశిల రఘురాం, స్థానిక శాసనసభ్యుడు కె. రక్షణనిధిలతో చర్చించినట్లు చెప్పారు. ఏర్పాట్లలో భాగంగా హెలి ప్యాడ్‌, సభా వేదిక, బారికేడ్లు తదితర ఏర్పాట్లను స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ సహకారంతో ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పర్యవేక్షించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల వాహనాలకు అవసరమైన పార్కింగ్‌ సంబంధించిన ఏర్పాట్లు జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ చూడాలన్నారు. ప్రధాన వేదిక నిర్మాణ ఏర్పాటు, వీఐపీ, వీవీఐపీలకు సీటింగ్‌ ఏర్పాటు, బ్యాక్‌ డ్రాప్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లను తిరువూరు ఆర్డీవో, తహసీల్దార్‌ పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులకు సీటింగ్‌ ఏర్పాట్లు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు పంపిణీని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, డ్వామా పీడీ పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల అగ్నిమాపక పరికరాలను, ఫైరింజన్‌ ఏర్పాటు చేయాలని అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం వద్ద అంబులెన్స్‌, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యాధికారులు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే రక్షణనిధితో పాటు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా బుధవారం పరిశీలించారు. ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్‌ నుంచి విజయవాడ రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సభాస్థలికి వచ్చే రోడ్లలో ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై స్థానిక పోలీసులకు సీపీ సూచనలిచ్చారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి వారితో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement