జెడ్పీటీసీకి రూ.20 లక్షలు | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీకి రూ.20 లక్షలు

Published Thu, Jul 20 2023 2:40 AM

- - Sakshi

● మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కేటాయింపు ● సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ● సమావేశానికి హాజరైన కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధికారులు

చిలకలపూడి(మచిలీపట్నం): ఒక్కొక్క జెడ్పీటీసీ సభ్యుడికి రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ప్రకటించారు. ఈ నిధులతో ఆయా మండలాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌హాలులో ఉప్పాల హారిక అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరి గింది. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఇరిగేషన్‌, వ్యవసాయం, జగనన్న ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ సభ్యులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులు వాటికి సమాధానాలు ఇచ్చారు. చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను సమావేశంలో పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

సమస్యల ప్రస్తావన ఇలా..

విద్యాశాఖ సమీక్షలో ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు సక్రమంగా అమలు కావటం లేదన్నారు. అమ్మఒడి నిధులు ఇంకా కొంత మందికి జమకాలేదని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు స్పందిస్తూ.. ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి 25 శాతం పేద పిల్లలకు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మఒడి నిధులు లబ్ధిదా రుల బ్యాంక్‌ ఖాతాల్లో జమమవుతున్నాయని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనా సీట్లు కేటాయించటం లేదని జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యులు మందా జక్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతి పాదన పంపిస్తామని విద్యాశాఖాధికారులు సమాధానమిచ్చారు. కలిదిండి మండలం కోరుకొల్లు పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే టీచర్లు బదిలీలు చేయించుకుని వెళ్లిపోతున్నారని కలిదిండి ఎంపీపీ సమావేశంలో ప్రస్తావించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో పంటకాలువల్లో గుర్రపు డెక్క, తూడు తక్షణమే తొలగించాలని సభ్యులు కోరారు. గూడూరు కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్‌లో స్టాఫ్‌నర్సులతో పాటు ఆశా వర్కర్ల కొరత ఉందని జెడ్పీటీసీ వేముల సురేష్‌ తెలిపారు. ముసునూరులో రూ.కోటితో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణం నిలిచిపోయిందని, దీనిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు కోరారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని, సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఆయా శాఖల అధికారులు కృషి చేయా లని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, మొండి తోక అరుణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌, ౖకైలే అనిల్‌కుమార్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుదిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

అసంపూర్తి భవనాల్లో తరగతులు

నందిగామ నియోజకవర్గ పరిధిలోని కొండవరం పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అసంపూర్తిగా వదిలేసి దానిలోనే 450 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ఈ సమావేశం దృష్టికి తెచ్చారు. వానకాలం, విపత్తుల సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ స్పందించి, పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏలూరు అధికారులపై ఆగ్రహం

జెడ్పీ సర్వ సభ్య సమావేశానికి కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఉన్నతాధికారులు హాజరవుతున్నా ఏలూరు జిల్లా అధికారులు రాకపోవడంపై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అసహనం వ్యక్తంచేశారు. ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు రాకుండా సిబ్బందిని పంపడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాకు చెందిన నూజివీడు, కై కలూరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగే సభకు హాజరు కాని ఏలూరు జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులపై చర్యలకు తీర్మానం చేయాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారికను పేర్ని నాని కోరారు. వచ్చే సమావేశానికి హాజరుకాకుంటే సభ్యులతో కలిసి నిరసన తెలుపుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సభ్యులు, అధికారులు
1/3

సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సభ్యులు, అధికారులు

2/3

3/3

Advertisement
Advertisement