నవజాత శిశువు మృతిపై దుష్ప్రచారమేలా? | Sakshi
Sakshi News home page

నవజాత శిశువు మృతిపై దుష్ప్రచారమేలా?

Published Sat, Nov 11 2023 1:26 AM

-

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎంతో మంది నవజాత శిశువుల ప్రాణాలు నిలిపారు. నెలల నిండకుండా పుట్టిన 600 గ్రాములు, 800 గ్రాముల శిశువులకు ప్రాణం పోశారు. కార్పొరేట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చుయ్యే వైద్యాన్ని సైతం ఉచితంగా అందించే ప్రభుత్వాస్పత్రి నవజాత శిశు విభాగంపై పచ్చమీడియా, కమ్యునిస్టులు దుష్ప్రచారానికి తెరలేపారు. నెలల నిండకుండా పుట్టిన నవజాత శిశువు మరణాన్ని సాకుగా చూపి, ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తూ, ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటే పేదలు భయపడేలా ప్రచారం చేశారు. వాస్తవాలు వైద్యులు చెబుతున్నా, అవేమీ తమకు పట్టవంటూ, ఆస్పత్రిపై దుమ్మెత్తిపోయడమే తమ లక్ష్యమనే రీతిలో పచ్చమీడియా రెచ్చిపోయి మరీ ప్రచారం చేసింది. కంకిపాడుకు చెందిన 8 నెలల గర్భిణి గంగాభవానీ ఈ నెల 8న ప్రసూతి విభాగానికి వచ్చింది. అదే రోజు ప్రసవం కాగా, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారిద్దరూ బరువు తక్కువుగా ఉండటం, ఆక్సిజన్‌ తీసుకోలేక పోవడంతో స్పెషల్‌ న్యూబర్న్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచారు. వారిలో ఒకరు శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృత శిశువును బంధువులకు ఇస్తున్న సమయంలో చేతికి మరో ట్యాగ్‌ ఉండటాన్ని వారు గుర్తించి, మృతి చెందింది మా శిశువు కాదని వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శిశువు చేతికి ఉన్న ట్యాగ్‌తో పాటు అదనంగా వచ్చిన మరో ట్యాగ్‌ పేరును పరిశీలించగా, అది మగ శిశువుగా నిర్ధారించారు. వార్మర్స్‌లో ఉంచినప్పుడు వేరే శిశువు ట్యాగ్‌ ఊడిందని పొరపాటున అది మృత శిశువుతో పాటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కమ్యునిస్టులు, బంధువుల ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు వైద్యులు విచారణ చేసేందుకు నిర్ణయించారు. నవజాత శిశువుకు వైద్యం చేయడంలో తప్పిదమేమి లేదని ఆస్పత్రి డెప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సొంగా వినయ్‌కుమార్‌, పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ పరుచూరి అనీల్‌కుమార్‌, ఎస్‌ఎన్‌సీయూ నోడల్‌ అధికారి డాక్టర్‌ సునీత పేర్కొన్నారు. మృతి చెందిన శిశువు తండ్రి సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్ని ఆధారాలు చూపిన వైద్యులు అయినా ఆందోళనకు దిగిన కమ్యునిస్టులు వారికి తోడుగా పచ్చమీడియా

Advertisement
Advertisement