శ్రీమన్నారాయణుడి ఆలయంలో దొంగలు బీభత్సం | Sakshi
Sakshi News home page

శ్రీమన్నారాయణుడి ఆలయంలో దొంగలు బీభత్సం

Published Sat, Nov 11 2023 1:26 AM

-

కోడూరు: అభినవ మేల్కోటగా ప్రసిద్ధిగాంచిన ఉల్లిపాలెం గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. రోజు మాదిరిగానే శ్రీమన్నారాయణుడి దేవాలయ ప్రధానార్చకుడు కృష్ణమాచార్యులు స్వామివార్ల పూజలనంతరం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఆలయ దక్షిణ ద్వారం తాళాలను దుండగులు పగలకొట్టి గుడిలోకి ప్రవేశించారు. దేవాలయం లోపల భాగంలోని స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా ఉన్న గోదా, రాజ్యలక్ష్మీ అమ్మవార్ల ఉపాలయాల తాళాలను కూడా దొంగలు పగలకొట్టారు. ఉపాలయాల్లో ఉన్న 12 వెండి పంచపాత్రలు, రెండు ఉద్దరిణీలు, రాజ్యలక్ష్మీ అమ్మవారికి మెడలో అలంకరించిన రెండు బంగారు మంగళసూత్రాలను దొంగలు అపహరించారు. పంచపాత్రలపై శంఖు, చక్ర, నామాలు ఉంటాయని, 12 పాత్రలు మొత్తం సుమారు ఆరు కేజీల వరకు ఉంటాయని ఆలయ ధర్మాధికారి పంచాంగం రంగాచార్యులు తెలిపారు. వెండి విలువ సుమారు రూ.4.60 లక్షలు, బంగారం విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఆలయంలో పని చేసేవారు దక్షిణ ద్వారం తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి, తమకు తెలపడంతో ఘటనపై కోడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రంగాచార్యులు తెలిపారు. చోరీ జరిగిన ఆలయ ప్రాంతాన్ని అవనిగడ్డ సీఐ రమేష్‌, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. ఆలయ ప్రాంగణమంతా తిరిగి వివరాలు సేకరించారు. మచిలీపట్నంకు చెందిన క్లూస్‌ టీం ఘటనాస్థలంలోని తాళాలపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఆలయ లోపల ఉన్న సీసీ కెమెరాలు పని చేయడం లేదని, దీనిని అదునుగా చేసుకొని దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement