వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపిక

Published Sat, Nov 11 2023 1:26 AM

- - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ (పురుషులు) టోర్నమెంట్‌లో పాల్గొనే డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ బాస్కెట్‌బాల్‌ (పురుషులు) జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి ఈ.త్రిమ్మూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. తిరువనంతపురంలోని కేరళ విశ్వవిద్యాలయంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో వర్సిటీ తరఫున ఈ జట్టు పాల్గొంటుందని వివరించారు. జట్టులోని సభ్యులను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి, వీసీ డాక్టర్‌ కె. బాబ్జీలు అభినందించారు.

రేడియాలజిస్ట్‌ వరప్రసాద్‌కు అంతర్జాతీయ అవార్డు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ వేమూరి వరప్రసాద్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. రేడియాలజీలో అందిస్తున్న అత్యున్నత సేవలకు గాను యూకేకు చెందిన జేసీఏ సెమినార్స్‌ సంస్థ బెస్ట్‌ డయోగ్నోస్టిక్‌ రేడియాలజిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తున్న రేడియాలజిస్టులకు విభిన్న విభాగాల్లో అవార్డులు ప్రకటించగా, బెస్ట్‌ డయోగ్నోస్టిక్‌ రేడియాలజిస్టుగా డాక్టర్‌ వేమూరి వరప్రసాద్‌ను ఎంపిక చేశారు. కాగా డాక్టర్‌ వరప్రసాద్‌ ఇండియన్‌ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ అసోసియేషన్‌(ఐఆర్‌ఐఏ) జాతీయ ఎలక్ట్‌ అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా ఏషియన్‌ మస్కులోస్కేలేటల్‌ సొసైటీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

నిషేధిత సిగరెట్లు స్వాధీనం

రామవరప్పాడు(గన్నవరం): నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం గూడవల్లిలో దాడులు నిర్వహించి సుమారు రూ. 7లక్షల విలువైన సిగరెట్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని డెలివరీ హబ్‌ గోడౌన్‌పై విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వసంత్‌ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ఆరు క్వార్టన్‌ బాక్సులను గుర్తించారు. వాటిలో 14,400 సిగిరెట్‌ ప్యాకెట్లు నిషేధిత పొగాకు ఉత్పత్తులుగా ధ్రువీకరించి స్వాధీన పరుచుకున్నారు. సీజ్‌ చేసిన సిగరెట్‌ బాక్సులను పటమట పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే గోడౌన్‌లో ఈనెల 8న రూ. 8.64 లక్షల విలువజేసే నిషేధిత సిగ రెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

‘తెలంగాణలో కాంగ్రెస్‌కే అధికారం’

గన్నవరం: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డితో కలిసి ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్టీ నేతలు సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నరసింహారావు, ధనేకుల మురళీ స్వాగతం పలికారు. అనంతరం శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ అసమర్థ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమన్నారు.

రేపు ఎన్టీఆర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం జిల్లా సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.దిలీప్‌ ప్రసన్న బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం ఆవరణలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. 2008 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement