Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో ధనలక్ష్మి పూజ

Published Tue, Nov 14 2023 12:40 AM

రాజగోపురం వద్ద దీపావళి వేడుకలు - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం ధనలక్ష్మి పూజ నిర్వహించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ వద్ద ఆలయ అర్చకులు ఈ పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, ఆలయ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయం చుట్టూ దీపాలను వెలిగించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా ఆలయం చుట్టూ నేతి దీపాలను వెలిగించడం ఆనవాయితీ వస్తోందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు, ఏఈఓ చంద్రశేఖర్‌, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఆలయ అర్చకులు కోట రవి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పాల్గొని బాణసంచా కాల్చి సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వెంకటరమణ అమ్మవారిని దర్శించుకున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌ అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఈఈ కోటేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

ఆర్జిత సేవలకు డిమాండ్‌

దీపావళి అమావాస్య నేపథ్యంలో ఆదివారం, సోమవారం అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలకు డిమాండ్‌ అధికంగా కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చాన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణంతో పాటు హోమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు.

ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు అమావాస్య నేపథ్యంలో వీఐపీల తాకిడి

Advertisement

What’s your opinion

Advertisement