నాగరాజాయ నమః | Sakshi
Sakshi News home page

నాగరాజాయ నమః

Published Sat, Nov 18 2023 1:56 AM

చోడవరంలో పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు  - Sakshi

పెనమలూరు: చోడవరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ సహిత నాగేంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం నాగుల చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున చోడవరంలో ఉన్న నాగేంద్రస్వామివారి ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాంతం తిరునగరి వీరరాఘవకృష్ణశర్మ, శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో ఆవుపాలు, చలివిడి, కోడిగుడ్లు, వడపప్పు వేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. యనమలకుదురులోని శ్రీరామలింగేశ్వరస్వామివారి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీనాగేంద్రస్వామివారి ఆలయంలో కూడా నాగులచవితిని ఘనంగా చేశారు.

మోపిదేవి(అవనిగడ్డ): వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో కోలాహలంగా మారింది. నాగుల చవితి పర్వదినం కావడంతో ఉభయ రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఎటు చూసినా భక్తజనంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ ఏసీ ఎన్‌ఎస్‌ చక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ ప్రాంగణంలోనే షామియానా వేయించి అక్కడే క్యూలైన్లు పెంచడం వల్ల ఎండ తాకిడి లేకుండా చేశారు. క్యూలైన్‌లో మజ్జిగ, మంచినీళ్లు, పిల్లలకు పాలు నిరంతరం అందిస్తూనే ఉన్నారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌ ప్రత్యేక చొరవతో ఆర్టీసీ బస్సులు గుడి ఎదుట ఆపకుండా నేరుగా బస్టాండ్‌లోనే నిలిపేలా చేయడం వల్ల ట్రాఫిక్‌ చాలా వరకు తగ్గింది. చల్లపల్లి సీఐ నాగప్రసాద్‌ ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఏసీ చక్రధరరావు చెప్పారు.

మోహినీపురంలోని నాగపుట్టలో పాలుపోస్తున్న భక్తులు
1/1

మోహినీపురంలోని నాగపుట్టలో పాలుపోస్తున్న భక్తులు

Advertisement
Advertisement