చకచకా పోర్టు నిర్మాణం | Sakshi
Sakshi News home page

చకచకా పోర్టు నిర్మాణం

Published Sat, Nov 18 2023 1:56 AM

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌                  రాజాబాబు చిత్రంలో ఎమ్మెల్యే పేర్ని నాని - Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): బందరు పోర్టు నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని)తో కలిసి పోర్టు, రైడ్స్‌, మెగా ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ పోర్టు పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి 2.075 మీటర్ల దక్షిణ బ్రేక్‌ వాటర్‌ గోడ నిర్మాణం ఇప్పటి వరకు 1,100 మీటర్ల మేర పూర్తయిందన్నారు. మరోవైపు కస్టమ్స్‌, సెక్యూరిటీ, ఫైర్‌ స్టేషన్‌, వేర్‌ హౌసింగ్‌ తదితర భవనాలకు పునాదిలో ఫైలింగ్‌ దశ పూర్తయిందని పేర్కొన్నారు. 60 ఎకరాల్లో గ్రౌండ్‌ ఇంప్రూమెంట్‌ రిలేటెడ్‌ ఫైలింగ్‌ పనులు పూర్తయ్యాయని వివరించారు. ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో ఒక కిలోమీటర్‌ మార్గాన్ని పటిష్టంగా చదును చేసే ప్రక్రియ మొదలైందని తెలిపారు.

ముందుగానే పూర్తి..

ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన నాటి నుంచి 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను చూస్తుంటే నిర్దేశించిన లక్ష్యం కంటే ముందుగానే 20 నెలల్లో మొదటి దశ పూర్తవుతుందని తెలిపారు. 250 మంది టెక్నికల్‌ ఇంజినీర్లు, తదితర సాంకేతిక సిబ్బంది, సుమారు 700 మంది కార్మికులు పోర్టు నిర్మాణంలో రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారన్నారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దయాసాగర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విద్యాశంకర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ రాఘవరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కేవీకే పల్లారావు, కృష్ణా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ జ్ఞానమణి, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, ఆర్డీఓ ఎం.వాణి, మెగా ఇంజినీరింగ్‌ సంస్థ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రాఘవేంద్రరావు, రైట్స్‌ సంస్థ మేనేజర్‌ ఎంవీపీ రవికుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ 1100 మీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తి 60 ఎకరాల్లో పూర్తయిన గ్రౌండ్‌ ఇంప్రూమెంట్‌ ఫైలింగ్‌ పనులు కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు

Advertisement

తప్పక చదవండి

Advertisement