తేరుకుంటున్న అన్నదాత | Sakshi
Sakshi News home page

తేరుకుంటున్న అన్నదాత

Published Fri, Dec 8 2023 1:38 AM

కంకిపాడు మండలంలోని మంతెనలో ధాన్యం ఆరబోత పనుల్లో కూలీలు   - Sakshi

అవనిగడ్డ/కంకిపాడు(పెనమలూరు): ఉమ్మడి కృష్ణాజిల్లాలో మిచాంగ్‌ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి రైతులు తేరుకుంటున్నారు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా 2.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. తుపాను తీరందాటడంతో వాతావరణం తెరపిచ్చింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో రైతులు పంట సస్యరక్షణ చర్యలపై దృష్టి సారించారు. తుపాను ప్రభావంతో ఈ నెల మూడు నుంచి ఐదో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలగా, కోతలు పూర్తయిన పొలాల్లో వరి పనలు నీట మునిగాయి. మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు తడిచాయి. కలెక్టర్లు పి.రాజాబాబు, ఎస్‌. ఢిల్లీరావు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ, ప్రత్యేక చొరవతో యుద్ధ ప్రాతిపదికన మిల్లులకు, ఏఎంసీ కార్యాలయాల పరిధిలోని గోదాములకు ధాన్యాన్ని తరలించి నష్టాన్ని నివారించారు. తేమశాతం, జీపీఎస్‌ నిబంధనల సడలింపుతో ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా రైతులకు ఊరట చేకూరింది. తుపాను నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 20 వేల టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది.

సస్యరక్షణ చర్యలపై దృష్టి

బుధ, గురువారాల్లో వాతావరణం పూర్తిగా తెరపిచ్చింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేందుకు అనువుగా ఉండటంతో రైతులు పంట సంరక్షణ చర్యలకు ఉపక్రమించారు. బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా పది వేల టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. ఆఫ్‌లైన్‌లో నమోదు చేసిన 25 వేల టన్నుల ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా వివిధ ఏఎంసీ కార్యాలయాల గోదాముల్లో భద్రపరిచారు. వీటిని ఆన్‌లైన్‌ చేసి మిల్లులకు తరలించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. పంట పొలాల్లో నీటి తొలగింపు, నీట మునిగిన వరి పనలు పాడవకుండా ఉప్పు ద్రావణం పిచికారీపై వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సూచనలు ఇస్తున్నారు. ఉద్యాన పంటల్లో యాజమాన్య చర్యలను ఆ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు. రైతులు సైతం పంటలను కాపాడుకునే పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. నేలవాలిన వరిపైరును పైకిలేపి కూలీలతో కట్టిస్తున్నారు. నీటమునిగిన పనలను ఆరబెడుతున్నారు.

నష్టం ఇలా..

జిల్లాలో 2.71లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తం 3.78లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 2,44,897 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. 63,805 ఎకరాల్లో పనలపై ఉన్న పంట నీటమునిగింది. 1,81,392 ఎకరాల్లో పైరు నేలవాలింది. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 56,615 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పామర్రు నియోజకవర్గంలో 53,825 ఎకరాలు, గన్నవరం నియోజకవర్గం 37,914, పెడన 34,095, గుడివాడ 28,258, పెనమలూరు 18,325, మచిలీపట్నం నియోజకవర్గం 15,865 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 16,845 ఎకరాల్లో మినుము, 2,680 ఎకరాల్లో వేరుశనగ, 640 ఎకరాల్లో పత్తి, 875 ఎకరాల్లో మొక్కజొన్న, 1,420 ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది.

ఎమ్మెల్యేల పొలంబాట

తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు పలువురు ఎమ్మెల్యేలు పొలంబాట పట్టారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పెనుగంచిప్రోలు మండలంలో, నందిగామ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు చందర్లపాడు మండలంలో, బందరు ఎంపీ బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కంకిపాడుల్లో నీటమునిగిన, పడిపోయిన వరిపొలాలను పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు.

తెరిపిచ్చిన వాతావరణం

పంటల సంరక్షణ చర్యల్లో నిమగ్నం

మళ్లీ ఊపందుకున్న ధాన్యం రవాణా

పంటను పరిశీలించిన ప్రజాప్రతినిధులు

1/1

Advertisement
Advertisement