వాహనాల కొరత లేకుండా చూడండి | Sakshi
Sakshi News home page

వాహనాల కొరత లేకుండా చూడండి

Published Fri, Dec 8 2023 1:38 AM

-

చిలకలపూడి(మచిలీపట్నం): ధాన్యం సేకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. తన చాంబర్‌లో గురువారం ఆయన అధికారులు, వాహనాల యజమానులతో సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్ల ద్వారా 1137 జీపీఎస్‌ పరికరాలు అమర్చిన వాహనాలను సిద్ధం చేశామని కలెక్టర్‌ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్బీకేల నుంచే నేరుగా రైతులకు వాహనాలు కేటాయించాలన్నారు. వాహనాలను సంబంధిత తహసీల్దార్ల నియంత్రణలో ఉంచుకుని అవసరాన్ని బట్టి వినియోగించాలన్నారు. రవాణా, పోలీస్‌శాఖల అధికారులు ప్రతిరోజు జీపీఎస్‌ ద్వారా వాహనాల కదలికలను గమనించాలన్నారు. జేసీ అపరాజిత సింగ్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.పద్మావతి, పౌరసరఫరాల సంస్థ ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ దాసి రాజు, డీఎస్‌ఓ వి.పార్వతి పాల్గొన్నారు.

సహాయ చర్యలు చేపట్టాం

తుపాను నేపథ్యంలో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టామని కలెక్టర్‌ పి.రాజాబాబు చెప్పారు. తుపాను అనంతరం తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్‌ రాజాబాబు వివరించారు. 67 పునరావాస కేంద్రాల్లో 1,234 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. వారు ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.23,60,500 ఆర్థిక సాయం అందించామన్నారు. పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.19.75 లక్షలలో 50 శాతం ఇప్పటికే చెల్లించినట్లు తెలిపారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు

Advertisement
Advertisement