పంట నష్టం సర్వే పూర్తి | Sakshi
Sakshi News home page

పంట నష్టం సర్వే పూర్తి

Published Wed, Dec 20 2023 1:48 AM

పొలాన్ని పరిశీలించి నష్టం అంచనా వేస్తున్న కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి   - Sakshi

కంకిపాడు(పెనమలూరు): పంట నష్టం సర్వే పూర్తయింది. గ్రామస్థాయిలో పంట నష్టం వివరాలను నమోదు చేసిన అధికారులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలను సిద్ధంగా ఉంచారు. రైతులు ఆ జాబితాలను పరిశీలించుకుని అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కూడా ప్రభుత్వం ఇచ్చింది. పంట నష్టం జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది.

నష్టం ఇలా..

మిచాంగ్‌ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంటలకు అపార నష్టం వాటిల్లింది. 1.03 లక్షల హెక్టా ర్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. 96,421 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. 324 హెక్టార్లలో మొక్కజొన్న, 5765 హెక్టార్లలో మినుము, 212 హెక్టార్లలో పత్తి, 1056 హెక్టార్లలో వేరుశనగ దెబ్బతిన్నాయి. 568 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా.

సిద్ధమైన జాబితాలు..

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టం సర్వే చేసి నివేదికలు రూపొందించాలని ఆదేశించింది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు పర్యవేక్ష ణలో వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం సర్వే చేపట్టారు. ఈ నెల 11వ తేదీన పంట నష్టం సర్వే చేపట్టి మంగళవారం పూర్తి చేశారు. పంటల వారీగా, 33 శాతం పైన నష్టం వాటిల్లిన వాటి వివరాలను నమోదు చేశారు. అంతకంటే తక్కువగా వాటిల్లిన పంట నష్టం వివరాలను సైతం సేకరించారు. రైతులు, కౌలురైతులు, పంట వారీగా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వివరాలను నమోదు చేసి జాబితాలను సిద్ధం చేశారు. ఈ మేరకు జాబితాలను ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచారు. మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా భరోసా ఇచ్చేలా పంట నష్టం సర్వే పూర్తి చేశారు. పంట నష్టం జాబితాలపై ఈనెల 22వ తేదీ నుంచి ఆ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపు ఆర్‌బీకే స్థాయిలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి జాబితాను ఆమోదించి అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను మండల, డివిజనల్‌ స్థాయి ఆమోదంతో ఈనెల 26వ తేదీ నాటికి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి నివేదించనున్నారు. సోషల్‌ ఆడిట్‌ ద్వారా పంట నష్టపోయిన రైతుల వివరాలను పారదర్శకంగా రూపొందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సోషల్‌ ఆడిట్‌లను నిర్వహించనున్నారు.

గ్రామస్థాయిలో సిద్ధమైన జాబితాలు రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శన ఆర్‌బీకే స్థాయిలో సోషల్‌ ఆడిట్‌

Advertisement
Advertisement