పులి మాంసం రుచి చూద్దామని..! | Sakshi
Sakshi News home page

పులి మాంసం రుచి చూద్దామని..!

Published Sat, Jul 8 2023 11:24 AM

- - Sakshi

కర్ణాటక: కొందమాల్‌ జిల్లా బల్లిగుడా రేంజ్‌, తుమ్మిదిబందో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైకియా అటవీ ప్రాంతంలో పులిని వేటాడి హతమార్చి, మాంసం తిందామనుకున్న 13మంది ప్రబుద్ధులను అటవీశాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. బల్లిగుడ అటవీ ప్రాంతంలో రైకియా గ్రామస్తులు బుధవారం రాత్రి ఉమ్మడిగా పులిని వేటాడారు. అనంతరం గ్రామం సమీపంలోని తోటలో అంతా కలిసి వాటాలు వేసుకున్నారు.

ఇంటికి తీసుకు వచ్చి, కమ్మగా వండుకున్నారు. ఎట్టకేలకు.. పులి మాంసం రుచి చూద్దామనుకొని సిద్ధమవుతున్న సమయంలో విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ, పోలీసులు అధికారులు దాడి చేశారు. ఈ మేరకు 13మంది గ్రామస్తులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి పులి చర్మం, గోళ్లు, ఇతర అవయవాలు, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పులి వయస్సు, బరువు ఇతర వివరాలేమీ తెలియలేదు .ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

జింక మాంసం.. కిలో రూ.1500లు
రాయగడ:
రాయగడ రిజర్వ్‌ ఫారస్ట్‌లో జింకను వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆశాఖ డిప్యూటీ రేంజర్‌ సంజయ్‌కుమార్‌ సాహు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ సమీపంలోని మానిక్‌జోల గ్రామంలో జింక మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారి గౌరీశంకర్‌ సాహు, గార్డు సంతోష్‌ పాణిగ్రాహి, సిబ్బంది దాడులు నిర్వహించారు.

పితామహల్‌ గ్రామానికి చెందిన మాధవ ఉలక(43), మానిక్‌జోలకు చెందిన మాధవ ఉలక(41) వేటాడి తెచ్చిన జింక మాంసాన్ని గ్రామంలో కిలో రూ.1,500ల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుల్లో కొంతమంది పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వారినుంచి 3కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement