ఝరపడా జైలుకు నిందితుల తరలింపు | Sakshi
Sakshi News home page

ఝరపడా జైలుకు నిందితుల తరలింపు

Published Sat, Jul 15 2023 9:00 AM

- - Sakshi

భువనేశ్వర్‌: బాలాసోర్‌ జిల్లా బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాండ్‌ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ముగ్గురినీ ఝరపడా జైలుకు తరలించారు. ఈనెల 7న స్థానిక ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు 5 రోజుల రిమాండ్‌ విధించింది. కేసు విచారణ మరింత లోతుగా నిర్వహించాల్సి ఉందనే అభ్యర్థనతో దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) న్యాయస్థానాన్ని కోరడంతో ఈనెల 11న కోర్టు రిమాండ్‌ను మరో 4 రోజులు పొడిగించేందుకు అనుమతించింది.

ఈ వ్యవధి పూర్తి కావడంతో ముగ్గురు నిందితులు(సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌(సిగ్నల్‌) అరుణ్‌కుమార్‌ మహంత, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ అమీర్‌ఖాన్‌, టెక్నీషియన్‌ పప్పుకుమార్‌)ను స్థానిక జైలుకు తరలించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కి కోర్టు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జైలుకు తరలించిన వారిని ఈనెల 7న సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఐిపీసీ సెక్షన్లు 304(మరణానికి కారకులు), 201(సాక్ష్యాధారాల గల్లంతు) ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. 

నార్త్‌ సిగ్నల్‌ గూమ్టీ(స్టేషన్‌) వద్ద సిగ్నలింగ్‌ సర్క్యూట్‌ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఇది మానవ తప్పిదమని ఆగ్నేయ సర్కిల్‌ రైల్వే భద్రతా కమిషనర్‌(సీఆర్‌ఎస్‌) విచారణ నివేదికలో వెల్లడించింది.

నలుగురు ఉద్యోగులపై..
బహనాగా బజార్‌ రైలు దుర్ఘటన ఘటనలో మరో నలుగురు ఉద్యోగులను సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. స్థానిక ఝరపడా జైలు ప్రాంగణంలో ఈ విచారణ కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు సిగ్నల్‌ ఆపరేటర్లు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టేషన్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరందరినీ రైల్వేశాఖ విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement