Death Within Five Minutes Of Snake Bite - Sakshi
Sakshi News home page

పాము కాటు వేసిన ఐదు నిమిషాల్లో మృతి..

Published Tue, Jul 25 2023 2:28 AM

- - Sakshi

‘గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి గత ఏడాది సెప్టెంబర్‌ 8న పొలంలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా పాము కాటువేసింది. కాలికి ఏదో విషపురుగు కరిచినట్టు గుర్తించి నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిముషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. ఆయనకు కరిచింది చంద్రపొడి (రెసెల్స్‌వైపర్‌) జాతికి చెందిన విషసర్పమని, సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాలు నిలిచేవని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.’

కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ గత ఏడాది సెప్టెంబర్‌ 7న పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన ఎటువంటి భయానికి గురికాకుండా దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడి వైద్యులు స్నేక్‌యాంటీ వీనం వ్యాక్సిన్‌ వే శారు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్‌చేశారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది.

పార్వతీపురం టౌన్‌: వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలం పనిలో నిమగ్నమైన సమయంలో, గట్లపై వెళ్తున్న సమయంలో రైతులు పాముకాటు బారిన పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు సంవత్సరంలో 498 మంది పాముకాటుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. సరైన అవగాహనలేకపోవడం, సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని వైద్యులు తేల్చారు. అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు.

ఏమరపాటు తగదు...
ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకోవడాని కి అనేక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి. పొ లం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతో పాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకొంటాయి.అప్రమత్తంగా ఉండి పరిసరాల ను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాల కు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచు కోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవడం మంచి దని వైద్యులు సలహా ఇస్తున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల్ని గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్‌ యాంటీ వీనమ్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

పాము కాటుకు అందుబాటులో చికిత్స
పాముకాటు బారిన పడిన వ్యక్తికి పీహెచ్‌సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్‌వీనం వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా కరిచిన వెంటనే ముందుగా గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవా లి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్‌వీనం డోస్‌ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. భయపడకుండా నిర్భయంగా ఉండాలి.
– డాక్టర్‌ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, పార్వతీపురం మన్యం

పాము కాటు లక్షణాలు
పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావ డంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి.

ప్రథమ చికిత్స ఇలా..
పాము కాటుకు గురైన వ్యక్తిని నిదానపరచాలి. కంగారు పడకుండా చూడాలి. ఆందోళనకు గురైతే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి.

వేగంగా యాంటీ–వీనమ్‌ను అందించగల ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి.

గాయం కడగకూడదు. గాయం మీద ఐస్‌ను పెట్టకూడదు.

గాయం నుంచి విషాన్ని పీల్చేందుకు ప్రత్నించరాదు.

Advertisement
Advertisement