కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయండి | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయండి

Published Wed, Aug 2 2023 6:48 AM

- - Sakshi

కొరాపుట్‌: ఉమ్మర్‌ కోట్‌ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని నబరంగ్‌పూర్‌ పార్లమెంట్‌ సభ్యుడు రమేష్‌ చంద్ర మజ్జి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను అతని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. నబరంగ్‌పూర్‌ జిల్లా ఉమ్మర్‌ కోట్‌ ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. ఆ ప్రాంతంలో మరింత విద్యా వికాసం జరగాలంటే కేంద్రియ విద్యాలయం ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు.

ప్రభుత్వ సాయం అందజేత

కొరాపుట్‌: రథయాత్రలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే రఘురాం పొడాల్‌ రూ.3 లక్షల ప్రభుత్వ సాయం చెక్‌ మంగళవారం అందజేశారు. రథయాత్రలో భాగంలో కొలాబ్‌ నగర్‌లో బహుడా రోజున రథం మీద ఉన్న బబులా నాయక్‌ అనే యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబానికి సీఎం ప్రకటించిన పరిహారం అందజేశారు. కార్యక్రమంలో ఏడీఎంఏ రాజేంద్ర మజ్జి తదితరులు పాల్గొన్నారు.

12 అడుగుల కొండచిలువ పట్టివేత

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఎంవీ 2 గ్రామం వద్ద ఒక ఇంటిలో మంగళవారం 12 అడుగుల కొండచిలువ కనిపించింది. రాజేష్‌ హాంస్థా అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో చెత్తకుండి వద్ద పెద్ద కొండ చిలువ ఉండడాన్ని గమనించాడు. వెంటనే భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల ప్రజలు వచ్చారు. అనంతరం స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యుడు స్నేహశిష్‌ నాయిక్‌ వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అడవి నుంచి వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. అటవీ శాఖ సాయంతో అడవిలో విడిచిపెడతామని స్నేహశిష్‌ తెలిపారు.

20 కేజీల గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి సోరిషమాల గ్రామం వద్ద మంగళవారం ఉదయం మల్కన్‌గిరి ఎస్‌ఐ ఎస్‌.బోయి, సిబ్బంది లక్ష్మణ్‌ మారిండ, చిరంజీవి స్వయిలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక బస్తాను తలపె పెట్టుకొని రావడం గమనించారు. దీంతో వారిని ఆపి బస్తాను తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించి, వెంటనే ఇద్దరినీ అరెస్టు చేసి మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిని విచారించగా ఇద్దరూ సోరిషమాల గ్రామానికి చెందిన రాజేంద్ర మాఠం, గోవిందలుగా నిర్ధారించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని ఐఐసీ రీగాన్‌కీండో వెల్లడించారు.

చెక్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే రఘురాం పొడాల్‌
1/3

చెక్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే రఘురాం పొడాల్‌

పట్టుబడిన కొండ చిలువ
2/3

పట్టుబడిన కొండ చిలువ

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ రమేష్‌ చంద్ర మజ్జి
3/3

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ రమేష్‌ చంద్ర మజ్జి

Advertisement
Advertisement