సుదర్శన్‌ పట్నాయక్‌కు డాక్టరేట్‌ | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌ పట్నాయక్‌కు డాక్టరేట్‌

Published Fri, Nov 10 2023 5:00 AM

వినతిపత్రం అందజేసిన హరిరావు తదితరులు  - Sakshi

భువనేశ్వర్‌: ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు శ్రీశ్రీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. విశ్వ విద్యాలయం 10వ స్నాతకోత్సవంలో సుదర్శన్‌ పట్నాయక్‌ పండిట్‌ రవిశంకర్‌ చేతుల మీదుగా ఈ గౌరవం పొందారు. సైకత కళ ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పించినందుకు 2014 సంవత్సరంలో భారతదేశ నాల్గో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. సాధారణ ప్రజానీకంలో అవగాహన పెంపొందించడం, ప్రముఖుల విజయ గాథలను సైకత కళాఖండాలతో అభినందించడం, ప్రధాన సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి చైతన్యపరచడం కోసం అనేక కళాఖండాలను ఆవిష్కరించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. ఆయన ఆవిష్కరించిన ప్రసిద్ధ శిల్పాలలో 100 శాంటా క్లాజ్‌ల ఉమ్మడి శిల్పంతో ప్రపంచ గిన్నిస్‌ రికార్డ్‌ సాధించాడు. 25 అడుగుల సువిశాల శాంటా క్లాజ్‌ ఆవిష్కరణతో లిమ్కా ప్రపంచ రికార్డు పుస్తకంలో స్థానం సొంతం చేసుకున్నారు.

‘వృద్ధాప్య పింఛన్‌ పెంచాలి’

జయపురం: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్‌ కింద ఇచ్చే డబ్బులను పెంచాలని సామాజిక కార్యకర్త బి.హరిరావు కోరారు. ఈ మేరకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఉద్దేశించి వినతిపత్రాన్ని జయపురం సబ్‌ కలెక్టర్‌కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రంలోనూ పింఛన్‌ సొమ్మును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,750, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ.2,000, ఛత్తీష్‌ఘడ్‌లో రూ.2,000, ఢిల్లీలో రూ.2,500, హరియాణాలో రూ.2,750, కేరళలో రూ.1,400, సిక్కీంలో రూ.1,500, ఉత్తరాఖండ్‌లో రూ.1,500, పంజాబ్‌లో రూ.1,500లు ఇస్తుండగా, మన రాష్ట్రంలో కేవలం రూ.500లు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు ఇస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఉన్నతికి పనిచేస్తున్నామని విస్తృత ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, పెన్షన్లు పెంచేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, 5టీ కార్యదర్శి స్పందించి వృద్ధుల బాధలను తీర్చాలని కోరారు. వినతిపత్రం అందించినవారిలో వల్లభ ముదులి, జగన్నాథ్‌ హరిజన్‌, సనాధర హరిజన్‌, మధన పూజారి, బలరాం ముదిలి, రామఖ్‌ యాఢి తదితరులు ఉన్నారు.

మహిళా కార్యకర్తల పాత్ర కీలకం

జయపురం: రానున్న ఎన్నికల్లో మహిళా కార్యకర్తల పాత్ర కీలకమని జిల్లా మహిళా బీజేడీ నాయకురాలు డాక్టర్‌ ఇందిర నందో అన్నారు. స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో జయపురం మహిళా బీజేడీ కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ఇప్పటినుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలన్నారు. పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతీ వార్డులోనూ మహిళా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం జరపాలని విజ్ఞప్తి చేశారు. మీరా పరిడ మాట్లాడుతూ.. ఎన్నికల్లో మహిళా కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. సమావేశంలో జిల్లా మహిళా బీజేడీ అధ్యక్షురాలు పార్వతీ మస్థి, కొరాపుట్‌ జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షురాలు తులసీ కిరసాని, జయపురం మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ బి.సునీత, జిల్లా మహిళా బీజేడీ ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ బి.గాయిత్రీ దేవి, సబిత మిశ్ర తదితరులు పాల్గొన్నారు.

మహిళా కార్యకర్తలను ఉద్దేశించి 
మాట్లాడుతున్న ఇందిరా నందో
1/3

మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఇందిరా నందో

డాక్టరేట్‌ అందుకుంటున్న సుదర్శన్‌ పట్నాయక్‌
2/3

డాక్టరేట్‌ అందుకుంటున్న సుదర్శన్‌ పట్నాయక్‌

సమావేశంలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు
3/3

సమావేశంలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు

Advertisement

తప్పక చదవండి

Advertisement