Sakshi News home page

పంట పొలాల్లోకి జగన్నాథ్‌ సాగర్‌ నీరు

Published Tue, Nov 14 2023 1:36 AM

సాగర్‌ నుంచి విడిచిపెడుతున్న నీరు(ఫైల్‌) - Sakshi

జయపురం: స్థానిక చారిత్రాత్మక జగన్నాథ సాగర్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా ఉన్న నీటిని బయటకు వదిలేందుకు, పూడికను తొలగించేందుకు మున్సిపల్‌ సిబ్బంది చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గత శుక్రవారం నుంచి సాగర్‌లో నీటిని బయటకు విడిచిపెడుతున్నారు. అయితే ఆ నీరు జగన్నాథ్‌ సాగర్‌ నుంచి జయనగర్‌ మీదుగా పంట పొలాల్లోకి వెళ్తోంది. పంటలు కోతకు వచ్చే సమయానికి పొలాల్లోకి నీరు చేరుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటివలన దాదాపు 20 ఎకరాల్లో పంటలకు ముప్పు వాటిళ్లుతుందని వాపోతున్నారు. తాము ఎకరాకు రూ.40 వేలు చొప్పున ఖర్చు చేశామని, ఈ ఏడాది సక్రమంగా దిగుబడి వస్తుందనే ఆశతో ఉన్నామన్నారు. రానున్న 15 దినాల్లో పంటలు కోసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే పొలాల్లోకి ఎక్కువగా నీరు రావడం వలన కోతలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

16న దేశవ్యాప్త ఆందోళనలు

జయపురం: ఈనెల 16వ తేదీన పెన్షనర్ల డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టి, ప్రధానమంత్రికి ఉద్ధేశించిన వినతిపత్రాలు కలెక్టర్లకు సమర్పించాలని జాతీయ ఈపీఎఫ్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ పిలుపునిచ్చిందని కార్మిక నేత ప్రమోద్‌ కుమార్‌ మహంతి తెలియజేశారు. ఈ మేరకు స్థానిక యాదవ భవనంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు నళినీ కాంత రథ్‌ అధ్యక్షత ఈపీఎఫ్‌ పెన్షన్‌ర్ల అసోసియేషన్‌ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆందోళనల్లో పాల్గొని విజయంవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెన్షన్‌దారులకు కనీసం రూ.9 వేల పెన్షన్‌ చెల్లించాలని, పెన్షన్‌తో డీఏ కలపాలని, అందరినీ బిజూ పట్నాయక్‌ ఆరోగ్య పథకంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లు అంగీకరించకపోతే డిసెంబర్‌ 12వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహాధార్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ మహా ధర్నాలో ఒడిశా నుంచి 30 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం సేవా పేపర్‌ మిల్లు విశ్రాంత శ్రామికులకు బకాయి జీతాలు నేటికీ చెల్లంచనందుకు పేపర్‌ మిల్లు యాజమాన్యానికి లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో జి.ప్రసాదరావు, దండపాణి పాత్రో, కై లాస పండ పాల్గొన్నారు.

దారుణం

మద్యం తాగేందుకు రూ.100

ఇవ్వలేదని హత్య

జయపురం: సారా తాగేందుకు రూ.100 ఇవ్వకపోవడంతో హత్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సదర్‌ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి తెలియజేశారు. మరణించిన వ్యక్తి రామచంద్ర నాయిక్‌ కాగా అతడిని చంపిన వ్యక్తి మృతుని చిన్నాన్న కుమారుడు కావడం గమనార్హం. సదర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి డుంగిరిగుడ గ్రామానికి చెందిన చైతన్య నాయిక్‌ ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు రామచంద్ర నాయిక్‌ సేవా పేపరు మిల్లులో పని చేస్తున్నాడని తెలియజేశారు. ఈనెల 11వ తేదీన పేపరు మిల్లు నుంచి నడచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, మిల్లు కూడలి వద్ద వరుసకు సోదరుడైన మధు నాయిక్‌ రామచంద్రను సారా తాగేందుకు రూ.100 అడిగాడు. అయితే తాగుడికి తాను డబ్బులు ఇవ్వనని రామచంద్ర చెప్పడంతో కోపంతో తన వద్దనున్న వెదురు కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బతో రామచంద్ర కిందపడ్డాడన్నారు. వెంటనే అతడిని స్థానికులు స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిందితుడు మధు నాయిక్‌ను ఆదివారం అరెస్టు చేశామని, అతడు కొట్టేందుకు వినియోగించిన వెదురు కర్రను సీజ్‌ చేశామని పోలీసులు తెలియజేశారు.

Advertisement

What’s your opinion

Advertisement