మాజీ మంత్రి దామోదర్‌ రౌత్‌కు అనారోగ్యం | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి దామోదర్‌ రౌత్‌కు అనారోగ్యం

Published Sat, Dec 16 2023 12:46 AM

- - Sakshi

భువనేశ్వర్‌: సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి దామోదర్‌ రౌత్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానిక ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దామోదర రౌత్‌ కుమారుడు ఎమ్మెల్యే సంబిత్‌ రౌత్‌ మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాలేయంలో ద్రవం పేరుకుపోవడంతో నిరంతర ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రిలో ఉన్నట్లు వివరించారు. మరో రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారన్నారు. ఆయన శ్రేయోభిలాషులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు ఆలయాల్లో సామూహిక దీపారాధన చేస్తున్నారు.

ప్రారంభోత్సవానికి సన్నాహాలు

భువనేశ్వర్‌: శ్రీమందిరం ప్రాకార ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీన సుముహూర్తం. శాసీ్త్రయ రీతిలో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏఓ) రంజన్‌ కుమార్‌ దాస్‌ తెలిపారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం జరిగిన సాంస్కతిక కమిటీ సమావేశంలో అతిథుల జాబితాను ఖరారు చేశారు. భారతదేశంలో ప్రసిద్ధ జగన్నాథ దేవాలయాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, సాధుసంతులు, ఇతర మతపరమైన ప్రదేశాల నుంచి ప్రముఖులను ఈ ప్రారంభ వేడుకకు అతిథులుగా ఆహ్వానిస్తారు. దీనికోసం వివిధ నియోగి శాఖల సభ్యులు జాబితాను సిద్ధం చేసి శ్రీమందిరం పాలక మండలికి అందజేశారు. త్వరలో ఆహ్వాన పత్రిక సిద్ధం చేసి, అతిథులందరినీ ఆహ్వానించేందుకు సేవాయత్‌ ప్రతినిధులు ప్రత్యక్షంగా వెళ్లనున్నట్లు సమాచారం. ఆహ్వానితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

నిందితుడు అరెస్టు

జయపురం: కొంతమంది దుండగులు ఫోన్‌ ద్వారా బీహార్‌కు చెందిన ఒక యువకుడిని జయపురం పిలిచి అతడిని బంధించి, డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో ఒక దుండగుడిని జయపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక తెలియని వ్యక్తి సెప్టెంబర్‌ నెలలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన అలోక్‌ కుమార్‌ పాశ్వాన్‌కు ఫోన్‌చేసి స్నేహం కుదుర్చుకున్నాడు. అనంతరం అతడిని జయపురం రమ్మని పిలిచాడు. దీనిలో భాగంగా సెప్టెంబర్‌ 17వ తేదీన వచ్చిన ఆయనను పలువురు వ్యక్తులతో కలిసి ఫోన్‌చేసిన వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. పాశ్వాన్‌ నుంచి కొంత డబ్బులు దోచుకున్నారు. అనంతరం వారి నుంచి పాశ్వాన్‌ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నిందితుల్లో ఒకడైన కుంతరకాల్‌ గ్రామానికి చెందిన మాధవ హరిజన్‌ కుమారుడు కృష్ణ హరిజన్‌ అలియాస్‌ కుష్టో(21)ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

బీఎస్‌ఎఫ్‌ జవాన్ల ఉచిత వైద్య శిబిరం

మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ ఏరియా రల్లెగెడ పంచాయతీ డాబాల్‌పహడ్‌లో 88 బెటాలియన్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉచిత వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. అనంతరం గ్రామంలోని యువకులకు క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు అందజేశారు. అలాగే చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్‌లు అందించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కామాండర్‌ వినోద్‌ సారిన్‌ తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న దామోదర్‌ రౌత్‌
1/1

చికిత్స పొందుతున్న దామోదర్‌ రౌత్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement