యార్డులో 37,506 బస్తాల మిర్చి విక్రయం | Sakshi
Sakshi News home page

యార్డులో 37,506 బస్తాల మిర్చి విక్రయం

Published Sat, Dec 23 2023 4:44 AM

- - Sakshi

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 34,641 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 37,506 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.22,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి 23,500 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.12,000 నుంచి రూ.21,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.10,000 నుంచి 23,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 20,507 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.

31లోపు పెస్టిసైడ్స్‌

లైసెన్స్‌లో విద్యార్హత నమోదు

కొరిటెపాడు(గుంటూరు): పెస్టిసైడ్స్‌ లైసెన్స్‌ (పీఎల్‌) నందు ఈనెల 31వ తేదీలోపు క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్‌(విద్యార్హత పత్రం) నమోదు చేయించుకోవాలని ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గడువు తేదీని తిరిగి పొడిగించే అవకాశం లేదని, పురుగు మందుల డీలర్లు అందరూ తప్పనిసరిగా లైసెన్స్‌ నందు విద్యార్హతను విధిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. నమోదు చేయించుకోకపోతే లైసెన్స్‌ రద్దు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

అగ్రకుల అభ్యర్థులకూ గ్రూప్‌–1,2 ఉచిత శిక్షణ

గుంటూరు వెస్ట్‌ : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 పరీక్షలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలతోపాటు అగ్రకుల అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణనిప్పిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం విజయ పథకం పేరిట నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ద్వారా సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. 50 రోజులపాటు సాగే ఈ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కలిపి ఉచిత శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0863– 2358071 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

నిష్పక్షపాతంగా ఓటరు అర్జీల విచారణ

చీరాల టౌన్‌: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.. ఓటరు జాబితాలో మార్పులు, సవరణల అర్జీలను క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి నివేదికలను అందించాలని డీఆర్వో వెంకటరమణ సూచించారు. శుక్రవారం చీరాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటరు క్లెయిమ్‌ల విచారణలపై డీఆర్వో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల అర్బన్‌, రూరల్‌ మండలాల్లో నూతన ఓటు హక్కు, పోలింగ్‌ కేంద్రం మార్పు, పేర్లు మార్పు, చేర్పులకు వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఇళ్ల వద్దకే వెళ్లి విచారణ చేయాలన్నారు. అర్హులైన వారికే ఓటు హక్కు కల్పించడంతో పాటుగా డబుల్‌ ఎంట్రీలు, తప్పులు లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల సంఘం ఉద్యోగులకు కేటాయించిన విధుల్లో అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఎన్నికల విధులను రెవెన్యూ ఉద్యోగులు సమర్థంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ జీవిగుంట ప్రభాకరరావు, డెప్యూటీ తహసీల్దార్‌ పి.సురేష్‌ కుమార్‌, ఆర్‌ఐలు అర్జున్‌, శేఖర్‌, బీఎల్వోలు ఉన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 522.70 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 19,992, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 833.30 అడుగుల వద్ద ఉంది.

1/1

Advertisement
Advertisement