Sakshi News home page

ఎన్నికల వేళకు ఎగిరొచ్చేస్తారు!

Published Fri, Mar 29 2024 2:20 AM

-

సత్తెనపల్లి: పల్నాడులో ఫలితం ఎటు..? నరసరావుపేటలో నిలిచేది ఎవరు..? సత్తెనపల్లిలో సత్తా చాటేదెవరు..? గురజాలలో గెలుపు ఎవరిది..? చిలకలూరిపేటలో చిందేసేది ఎవరు..? పెదకూరపాడులో పెత్తనం ఎవరిది..? వినుకొండలో వాణి వినిపించేది ఎవరు..? మాచర్లలో మళ్లీ ఎలా ఉండబోతుంది..? సార్వత్రిక ఎన్నికల వేళ స్థానిక ఓటర్లలో ఆసక్తి సాధారణం. వివిధ దేశాలలో ఉన్నవారూ ఈ సమరంపై ఎక్కడా లేని ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి సంగతులు ఆన్‌లైన్‌, వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నారు. వారెవరో కాదండీ .. పల్నాడు జిల్లా నుంచి వివిధ ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లిన ఎన్‌ఆర్‌ఐలే. చాలా మంది ఎన్నికల సమయానికి స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీలపై అభిమానంతో వచ్చి ప్రచార వ్యూహాలకూ పదును పెడుతున్నారు.

ఓటర్లలో వీరు వేరయా..

పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 252 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన జాబితాలోని లెక్కలివి. అత్యధికంగా మాచర్ల నియోజకవర్గంలో 52 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉంటే అత్యల్పంగా వినుకొండ నియోజకవర్గంలో 21 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు.

విదేశాల్లో ఉన్నా ఓటు వినియోగం

విదేశాల్లో ఉంటున్నా భారతీయులు ఓటేయడానికి అర్హులే. అక్కడి పౌరసత్వం లేని భారతీయ పౌరుడు, పౌరురాలు 18 ఏళ్లు నిండితే చాలు పాస్‌పోర్ట్‌ లోని భారతదేశం చిరునామా వివరాలు పేర్కొనాలి. నమోదు చేసిన ప్రాంతంలోనే నేరుగా హాజరై ఓటు వేయాలి. ఓటు కోసం ఫారం–6 దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా ఈఆర్వోకు ఇవ్వవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఈఆర్వో చిరునామాకు పోస్ట్‌లోనూ పంపొచ్చు. పోస్టు ద్వారా పంపేవారు పాస్‌పోర్ట్‌ లోపల పేజీ ఫోటో, వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీని ఫోటో తీసి చెల్లుబాటు అయ్యే వీసా వివరాలు జత చేసి పంపాలి. ఈ పత్రాలన్నీ మనదేశ అధీకృత అధికారి ధృవీకరించాలి. ఈఆర్వోకి వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాలనుకుంటే ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌ సమర్పిస్తే పరిశీలన పూర్తయ్యాక ఇచ్చేస్తారు. పోలింగ్‌ రోజున ఇదే పాస్‌పోర్ట్‌ చూపించి ఓటు హక్కు వినియోగించు కోవచ్చు.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా

ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు...

నియోజకవర్గం ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు

పెదకూరపాడు 42

చిలకలూరిపేట 34

నరసరావుపేట 28

సత్తెనపల్లి 43

వినుకొండ 21

గురజాల 32

మాచర్ల 52

మొత్తం 252

జిల్లాలో 252 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు మాచర్ల నియోజకవర్గంలో 52 మంది

Advertisement

What’s your opinion

Advertisement