టెన్త్‌ ఫలితాల్లో సత్తాచాటిన సర్కార్‌ బడులు | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాల్లో సత్తాచాటిన సర్కార్‌ బడులు

Published Tue, Apr 23 2024 8:25 AM

విద్యార్థులను అభినందిస్తున్న 
డీఈఓ వెంకటేశ్వర్లు  - Sakshi

నరసరావుపేట ఈస్ట్‌: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో సర్కార్‌ బడులు సత్తా చాటాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను, పథకాలను సద్వినియోగ పరుచుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. సోమ వారం ప్రకటించిన పదవ తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలల నుంచి 25,207 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 23,792 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఉత్తీర్ణత 86.05 శాతంగా ఉంది. గత ఏడాది 69.47 ఉత్తీర్ణత శాతం ఉండగా ఈ ఏడాది గత ఏడాది కంటే మరో 16.5 శాతం అధిక ఉత్తీర్ణత సాధించింది. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు ఫలితం కనపడుతున్నది. నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు విద్యాశాఖాధికారిని నియమించటం ద్వారా విద్యార్థులపై విద్యా శాఖాధికారుల పర్యవేక్షణ పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి నాణ్యమైన ఆహారం, విద్యను అందించటంతో విద్యార్థులు కార్పోరేట్‌ పాఠశాలలతో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలలో నరసరావుపేటలోని తిలక్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన గాండ్లపర్తి రిషికరెడ్డి 593 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పులిపాడు జడ్పీ హైస్కూల్‌కు చెందిన జమ్మిగుంపుల ప్రమీల 590 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. వేల్పూరు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థి పి.భువనసాయి సుభాష్‌ 588, వినుకొండ జడ్పీ విద్యార్థిని బత్తుల గాయత్రి వెంకట హిమజ 587 మార్కులు సాధించారు. మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలకు చెందిన బృంగి లక్ష్మీ నాగశ్రావ్య 582, షేక్‌.అంజుమ్‌గౌసియా, మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన షేక్‌.నాసర్‌వలి 579 మార్కులు, ఎస్‌.వెంకట సహర్ష 557 మార్కులు సాధించారు. మాచర్ల కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని ఎం.భవాని 582 మార్కులు సాధించింది.

చిలకలూరిపేటలోని బాలుర రెసిడెన్షీయల్‌ పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా లోని 14 మోడల్‌ పాఠశాలల్లో చీకటీగలపాలెం పాఠశాల విద్యార్థులు మర్రెడ్డి భానుప్రసన్న 590, చెరుకుచెర్ల పావని 586, వెంకట నాగలక్ష్మీపూజిత 584మార్కులు సాధించారు.

ఐఏఎస్‌ కావడమే లక్ష్యం

వినుకొండ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానం తనకు ఎంతో దోహదపడిందని, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన బత్తుల గాయత్రి వెంకట హిమజ పేర్కొంది. పల్నాడు జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసించిన గాయత్రి 587 మార్కులు సాధించి, వినుకొండ మండల పరిథిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరి కంటే అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. రానున్న రోజులలో జెఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరచడమే కాకుండా, సివిల్స్‌లో ప్రతిభ కనబరిచి ఐఎఎస్‌ కావాల న్నది తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. తన ఉత్తీర్ణతకు సహకరించిన తల్లిదండ్రులు నాగేశ్వరరావు, జయశ్రీలకు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక కృత/్ఞతలు తెలియచేసింది. వినుకొండ రూరల్‌ నడిగడ్డ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తుల నాగేశ్వరరావు భార్య జయశ్రీలు తమ కుమార్తె ప్రతిభ కనబరిచి, అత్యధిక మార్కులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తు, చిన్నారి గాయత్రికి స్వీటు తినపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు

ఉపాధ్యాయుల సహకారం, సమిష్టి కృషితో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించాం. రానున్న రోజుల్లో మరింత కృషి చేసి హాజరు శాతం పెంచటంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.

– ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న వివిధ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు ఇలా ఉన్నాయి.

యాజమాన్యం పాఠశాలల హాజరైన ఉత్తీర్ణులైన ఉత్తీర్ణత శాతం

సంఖ్య విద్యార్థులు విద్యార్థులు

జడ్పీ హైస్కూల్స్‌ 179 10,940 9,917 90.64

మున్సిపల్‌ స్కూల్స్‌ 05 568 541 95.24

మోడల్‌ స్కూల్స్‌ 14 1,089 1,066 97.88

కె.జి.బి.వి. 24 857 806 94.04

ప్రభుత్వ 03 237 202 85.23

ఎయిడెడ్‌ 20 748 683 91.31

గిరిజన పాఠశాలలు 12 304 282 92.76

సోషల్‌ వెల్ఫేర్‌ 10 736 718 97.55

ఏపీ రెసిడెన్షీయల్‌ 01 33 33 100

బిసీ వెల్ఫేర్‌ 04 146 141 96.57

ఆశ్రమ 02 80 72 90

జిల్లాకు 18వ స్థానం ఉత్తీర్ణతా శాతం 86.05 గత ఏడాది కంటే 16.5 శాతం అధికం 593 మార్కులు సాధించిన మున్సిపల్‌ విద్యార్థిని రిషిత రెడ్డి సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు: డీఈఓ

పేదింట విద్యా కుసుమం

నరసరావుపేట ఈస్ట్‌: పేదింట విద్యా కుసుమం విరబూసింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిరుపేద విద్యార్థిని గాండ్లపర్తి రిషిత రెడ్డి 593 మార్కులతో పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల టాపర్‌గా నిలిచింది. పట్టణంలోని తిలక్‌ మున్సిపల్‌ పాఠశాల విద్యార్ధిని రిషితరెడ్డి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించింది. తండ్రి రంగారెడ్డి చిరు వ్యాపారి. చిన్నచిన్న దుకాణాలకు తినుబండాలను విక్రయిస్తుంటాడు. తల్లి స్వప్న కొబ్బరి మిల్లులో కూలీగా పనిచేస్తుంది. రోజూవారీ వచ్చిన కొద్దిపాటి కూలీ డబ్బుతోనే జీవనాన్ని సాగిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు జగనన్న అమ్మఒడి రిషిత చదువుకు ఎంతో ఉపయోగపడుతున్నదని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిషిత సోదరి బీటెక్‌ చదువుతోంది. రిషిత చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చాటుతున్నది. తన 8వ తరగతిలో నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికై ఏడాదికి రూ.12 వేలు స్కాలర్‌షిప్‌ సాధించింది. పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు కుంభా శివనరసింహా రావు, ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్టడీ అవర్స్‌ నిర్వహించటంతో పాటు వారికి అవసరమైన బోధనను ఎప్పటికప్పుడు అందించటం విద్యార్థులకు ఉపయోగపడింది. పాఠశాలలో 39 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 20 మంది 450కు పైగా మార్కులు సాధించారు.

కుమార్తెకు తీపి తినిపిస్తున్న 
తల్లిదండ్రులు నాగేశ్వరరావు, జయశ్రీ
1/2

కుమార్తెకు తీపి తినిపిస్తున్న తల్లిదండ్రులు నాగేశ్వరరావు, జయశ్రీ

గాండ్లపర్తి 
రిషితరెడ్డి
2/2

గాండ్లపర్తి రిషితరెడ్డి

Advertisement
Advertisement