Sakshi News home page

పోషకాలకు కేరాఫ్‌ రాగి జావ

Published Mon, Mar 27 2023 1:34 AM

రాగి జావ   - Sakshi

పార్వతీపురం: ఆరోగ్యాన్ని పెంపొందించేవన్నీ ప్రకృతిలో సులభంగా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి రాగులు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం, పురాతన ఆహరపు అలవాట్లలో సంప్రదాయ పదార్ధమైన రాగి జావలోని పోషకాల గురించి తెలుస్తుండడంతో సోషల్‌ మీడియా ద్వారా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల మధ్య రాగి జావ ప్రస్తావన వస్తోంది. అలాగే విద్యార్ధుల ఆరోగ్యాన్ని సెంపొందించేందుకు పాఠశాలల్లో వారానికి మూడు రోజుల పాటు రాగిజావను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మారిన జీవన శైలి

మారిన ప్రజల ఆహరపు అలవాట్లు, జీవన శైలితో వ్యాధులు కూడా వేగంగా ప్రబలుతున్నాయి. కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండి ఆర్థికంగా, శారీరకంగా దెబ్బతీస్తుండడంతో నివారణకోసం ప్రజలు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఆహరంలో సంభవిస్తున్న మార్పులే వ్యాధులకు కారణమని తెలియడంతో మళ్లీ సంప్రదాయ వంటకాలవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా రాగులతో చేసిన వంటకాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.

’ధర తక్కువ..పోషకాలు ఎక్కువ

తక్కువ ధరకే దొరకడంతో పాటు తక్కువ సమయంలో తయారుచేసుకునే రాగి జావ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మండుతున్న ఎండలనుంచి ఉపశమనం కోసం రాగి జావ తాగేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. టీస్టాల్స్‌లో టీ,కాఫీలకు బదులుగా రాగి గంజి వచ్చి చేరింది. రోజువారీ ఆహరంలో తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం, బీపీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. స్థూలకాయాన్ని నివారిస్తుంది. రాగి జావ రోజూ తాగినా, రాగిముద్ద తిన్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేరూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్‌, ప్రోటీన్‌లు, న్యూట్రీషన్లు, అందులో సమృద్ధిగా ఉంటాయి. రాగుల్లోని పోషకాలు, ఫైబర్‌వల్ల వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తుండడంతో వాటి వినియోగంపై ప్రజలు మరింత శ్రద్ధ కనబరుస్తున్నారు.

రాగి జావలో ఉండే పోషకాలు

రాగి జావలో విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ తదితర పోషకాలు అధికంగా దాగి ఉన్నాయి. బి కాంప్లెక్స్‌, థయామిన్‌, రైబోఫ్లావిన్‌, నియాసిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్పరస్‌ ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

● రాగి జావ రోజూ తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్‌, నిద్రలేమి తగ్గించుకోవచ్చు.

● యాంటీ ఆక్పిడెంట్‌లు ట్రిప్టోఫాన్‌, అమైనో ఆమ్లాలు సహజంగా విశ్రాంతిని కలిగిస్తాయి.

● రాగి జావలో పాలిఫైనాల్‌, డైటరీ ఫైబర్‌, మెగ్నీషీయం ఎక్కువగా ఉండటంవల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. –మధుమేహన్ని నియంత్రించేందుకు దోహదం చేస్తుంది.

● రాగి జావలో కొలెస్ట్రాల్‌ ఉండదు కావున గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.

● రక్తహీనత ఉన్నవారు రాగి జావను తాగితే విటమిన్‌ సి, హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతాయి.

● రాగి పిండిలో ఉన్న భాస్వరం ఎముకలు, దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు అధికం

వాడకంపై ప్రజల్లో పెరిగిన ఆసక్తి

రాగిజావతో బహుళ ప్రయోజనాలు

రాగుల్లో ఫైబర్‌, ప్రొటీన్లు, న్యూటీషన్లు సమృద్ధిగా ఉంటాయి. వాటిలోని పో షకాలు, ఫైబర్‌వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. టీ, కాఫీలకు బదులుగా రాగి గంజి తీసుకోవడం మంచిది. రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల బీపీ, సుగర్‌ సమస్యలనుంచి బయట పడవచ్చు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఎండాకాలంలో రాగిజావ, రాగిముద్ద తినడం శ్రేయస్కరం.

– డా.ఎన్‌ఎంకె. తిరుమల ప్రసాద్‌,

వైద్యులు, బందలుప్పి పీహెచ్‌సీ

Advertisement

తప్పక చదవండి

Advertisement