అభాగ్యులపై ‘వాత్సల్యం’ | Sakshi
Sakshi News home page

అభాగ్యులపై ‘వాత్సల్యం’

Published Fri, Mar 31 2023 2:26 AM

మిషన్‌ వాత్సల్య లోగో - Sakshi

ఆర్థికంగా చేయూత

ఏప్రిల్‌ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి

విజయనగరం ఫోర్ట్‌: విధి వంచితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ మేరకు ఎటువంటి ఆదరణ లేక అభాగ్యులుగా మిగిలిన పిల్లలకు చేయూత నిచ్చేందుకు చర్యలు చేపడుతోంది. వారి విద్య, వైద్య అవసరాలను తీర్చేందుకు ఆర్ధిక చేయూత అందించనుంది. ఈ నేపథ్యంలో ‘మిషన్‌ వాత్సల్య’ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్‌షిప్‌ కల్పిస్తున్నాయి. నిరాదరణ, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్ధి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. జిల్లాలో ఉన్న అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, తల్లిదండ్రులు దూరమైన వారు పాక్షిక అనాథలు (తల్లి లేక తండ్రిని కోల్పోయినవారు), విడాకులు పొందిన తల్లిదండ్రులు ఉన్నవారు, కుటుంబం వదిలేసిన, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పడినా, పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన, బాలల న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం–2015 ప్రకారం ఇల్లులేని పిల్లలకు ప్రకృతి వైపరీత్యానికి గురైన బాల కార్మికులు, అక్రమ రవాణా, దాడులకు గురైన బాలలు, బాల యాచకులు, బాల్య వివాహ, హెచ్‌ఐవీ బాధిత, పీడిత బాలలు, దివ్యాంగులకు మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా వారి అభివృద్ధికి ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పన ఆర్ధికసాయం అందించనున్నారు.

వార్షికాదాయం పరిమితి

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.96 వేలు మించరాదు. జేజే బోర్డు, బాలల సంక్షేమ కమిటీ కోర్టు లిఖిత పూర్వకంగా నమోదు చేసిన కారణాల అధారంగా అవసరాన్ని బట్టి స్పాన్సర్‌ షిప్‌ పొడిగించవచ్చు. స్పాన్సర్‌ షిప్‌ అందుకుంటున్న బాలలను ఏదైనా వసతి గృహం, బాల సదనంలో చేర్పించిన తర్వాత సహాయం నిలిపివేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలల విషయంలో మినహా పాఠశాలలకు వెళ్లే వారు పాఠశాల హాజరు 30 రోజులకు పైగా సక్రమంగా లేదని తేలినా పరిశీలించి తాత్కాలికంగా నిలిపివేస్తారు.

దరఖాస్తు పరిశీలన

సీడీపీఓ కార్యాలయాన్ని అందిన దరఖాస్తులన్నింటినీ మండల స్థాయి స్క్రూటినీ కమిటీ (ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, సీడీపీఓ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌) మీటింగ్‌లో దరఖాస్తులను నిశితంగా పరిశీలించి అర్హత కలిగి ఎంపిక చేసిన ప్రతి దరఖాస్తుపై కమిటీ సభ్యులందరూ సంతకం చేసిన తరువాత సదరు మీటింగ్‌ మినిట్స్‌ తో పాటు దరఖాస్తులన్నిటిని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయానికి సమర్పిస్తారు.

దరఖాస్తుకు జతచేయవలసిన పత్రాలు:

బాలుడి/బాలిక జననధ్రువీకరణ పత్రం

అధార్‌ కార్డు

తల్లి అధార్‌ కార్డు

తండ్రి అధార్‌ కార్డు

తల్లి, తండ్రి డెత్‌ సర్టిఫికెట్‌, మరణకారణం

గార్డియన్‌ అధార్‌

రేషన్‌ కార్డు

కుల ఽధ్రువీకరణ పత్రం

బాలుడు, బాలిక పాస్‌పోర్టు సైజు ఫొటో

స్టడీ సర్టిఫికెట్‌

ఆదాయ ఽఽధ్రువీకరణ పత్రం

బ్యాంకు అకౌంట్‌ వివరాలు బాలుడు, లేదా బాలిక వ్యక్తిగత అకౌంట్‌ లేక తల్లి తండ్రి సంరక్షకులతో కలిసిన జాయింట్‌ అకౌంట్‌

సీడీపీఓలకు ఆదేశాలు

మిషన్‌ వాత్సల్య పథకానికి సంబంధించి దరఖాస్తులు తీసుకోవాలని సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. వారి నుంచి వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపిస్తాం.

బి. శాంతకుమారి, జిల్లా మహిళా,

శిశు సంక్షేమ సాధికారత అధికారిణి

Advertisement

తప్పక చదవండి

Advertisement