శ్రీకాకుళం: ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు విద్యార్థులకు పంచండి మహాప్రభో | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు విద్యార్థులకు పంచండి మహాప్రభో

Published Tue, Apr 25 2023 1:30 AM

- - Sakshi

వీరఘట్టం: విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్స రంలో పాఠ్యపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ స్టేట్‌ టెక్ట్స్‌ బుక్స్‌ డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

ఈ నెల 20వ తేదీన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీని సందర్శించినప్పుడు 8వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదనే విషయా న్ని గుర్తించారు. దీనికి బాధ్యులను చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా డీఈఓ ఎస్‌.డి.వి రమణతో పాటు వీరఘట్టం ఎంఈఓ పి.కృష్ణమూర్తి, కేజీబీవీ ఎస్‌ఓ రోహిణి, జీసీడీఓ రోజారమణిలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

పాఠ్యపుస్తకాల పంపిణీ లో లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు కె. రవీంద్రనాధ్‌రెడ్డి వీరఘట్టం మండలానికి సోమవా రం వచ్చారు. రేగులపాడు కేజీబీవీ, వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంతో పాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు చేశారు. 8వ తరగతి గణిత పాఠ్యపుస్తకాలు వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పలు తరగతులకు చెందిన సుమారు రెండు వేలకు పైగా పాఠ్యపుస్తకాలు వీరఘట్టం ఎంఈఓ కార్యాలయంలో పంపిణీ చేయకుండా ఉండడాన్ని ఆయన గుర్తించారు.

ఈ పుస్తకాలు ఎందుకు పంపిణీ చేయలేదని ఎంఈఓ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. వాస్తవా నికి గత ఏడాది జూలై 25న 533 మంది 8వ తరగతి విద్యార్థులకు 560 పాఠ్యపుస్తకాలు రాగా, వీటిలో 452 తెలుగు మీడియం, 108 ఇంగ్లిషు మీడియం పుస్తకాలు వీరఘట్టం కార్యాలయానికి ఇచ్చినట్టు గుర్తించారు.

వీటిలో 108 ఇంగ్లిష్‌ మీడియం పుస్తకాలు తమకు రాలేదని ఇక్కడ సిబ్బంది అప్పటిలో జిల్లా అధికారులకు ఫోన్‌లో తెలియజేసారన్నారు. ఆ మేరకు పాఠ్యపుస్తకాలు అందినట్టు రాతపూర్వ కంగా అధికారుల వద్ద రుజువులు ఉన్నాయని చెప్పారు. వీరికి 108 పాఠ్యపుస్తకాలు అందలేదనే విషయానికి రుజువు లేకపోవడంతో చర్యలు తీసు కున్నట్టు స్టేట్‌ డైరెక్టర్‌ తెలిపారు.

క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని స్టేట్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఉన్నతస్థాయి అధికారులు వచ్చి పరిశీలించే వరకు ఏయే పుస్తకాలు విద్యార్థుల కు అందజేశామన్న విషయం తెలియకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఒక విద్యార్థికి విద్యా సంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవ డం తప్పుకాదా అని నిలదీశారు. పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థులకు పంపిణీ చేయకుండా ఇంకా శ్రీకాకుళం బుక్‌ డిపోలో 2.18 లక్షల పాఠ్యపుస్తకా లు ఉన్నాయని, ఈ పుస్తకాలను ఎందుకు పంపిణీ చేయలేకపోయారని వారిని అడిగారు.

అనంతరం జీసీడీఓ రోజారమణి, ఎంఈఓ కృష్ణమూర్తి, గతంలో ఉన్న ఎంఈఓ నారాయణస్వామి, కేజీబీవీ ఎస్‌ఓ, శ్రీకాకుళం బుక్స్‌ డిపో మేనేజర్‌ తదితరుల నుంచి ఆయన వివరణ తీసుకున్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఆయన వెంట శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య, పాలకొండ ఉప విద్యాశాఖ అధికారి విజయకుమారి తదితరులు ఉన్నారు.

1/1

Advertisement
Advertisement