చేతివృత్తుల పునరుద్ధరణ ఆనందదాయకం

15 Nov, 2023 02:08 IST|Sakshi

జామి: అంతరించిపోతున్న చేతివృత్తుల పునరుద్ధరణ హర్షణీయమని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన జామి మండలంలోని బలరాంపురం గ్రామంలో ఏవీఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్మాల్‌స్కేల్‌ యూనిట్‌ (విశాఖపట్నం) వారి సౌజన్యంతో ప్రగతిశీల మహిళాసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తిబడి చేతివృత్తుల శిక్షణాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ స్థానిక అధ్యక్షురాలు కొత్తపల్లి భూలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ కరోనా మహమ్మారి తరువాత ఆర్థిక స్వావలంబన, సాధికారత దిశలో కుదేలైపోయారన్నారు. వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి చేతివృత్తులను పునరుద్ధరించి ఆర్థికపరిపుష్టి కలిగించడం అభినందనీయమని ప్రశంసించారు. బలరాంపురంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ఎంవీఆర్‌ గ్రూప్‌ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పిలుపు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ రవి, స్థానిక పెద్దలు పి.ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు