మన్యంను ముందంజలో నిలిపేలా.. | Sakshi
Sakshi News home page

మన్యంను ముందంజలో నిలిపేలా..

Published Sun, Nov 19 2023 12:52 AM

- - Sakshi

పార్వతీపురం టౌన్‌:

పార్వతీపురం మన్యం జిల్లాలో చదువుల క్రతువు నిర్విఘ్నంగా సాగుతోంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో 87.47శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది శతశాతం ఫలితాల సాధనతో పాటు అధికమంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించేలా చక్కని బోధన ప్రణాళికను విద్యాశాఖ అధికారులు అమలుచేస్తున్నారు. ప్రభు త్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించేందుకు, ఉన్నత పాఠశాలల సందర్శనకు మండల, డివిజనల్‌, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులందరూ విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రతివారం తమకు దత్తత ఇచ్చిన పాఠశాలను పర్యవేక్షిస్తున్నారు. అక్కడి బోధన తీరు, విద్యార్థుల అభ్యసన, లోటుపాట్లను గుర్తించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. మన్యంలో చదువుల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

డీవీఎంఎం స్కూల్‌ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

పార్వతీపురం పట్టణం డాక్టర్‌ డీవీఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌, పాచిపెంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాాల ప్రత్యేకాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, మక్కువ మండలం వై.ఎస్‌.వలస, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల ప్రత్యేకాధికారిగా ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌ వ్యవహరించనున్నారు.

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం

అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించేందుకు ప్రత్యేక అధికారుల నియామకం

జిల్లాలోని 182 మందికి ఉన్నత పాఠశాలల బాధ్యతలు అప్పగింత

ప్రతి వారం పాఠశాలల సందర్శన

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా తర్ఫీదు

ప్రమాణాలతో కూడిన విద్య

ప్రతి పాఠశాలలో ప్రమాణాలతో కూడిన విద్యను బోధించేలా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలు పెంచడం, బోధనలో నూతన పద్ధతులు అవలంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచిస్తున్నాం. ఈ ఏడాది అధికారుల పర్యవేక్షణతో బోధన ప్రణాళిక చక్కగా అమలవుతోంది. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. – నిషాంత్‌ కుమార్‌, కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

1/1

Advertisement
Advertisement