Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర | Sakshi
Sakshi News home page

Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర

Published Mon, Feb 5 2024 12:26 AM

ఓ గ్రామంలో పెంపకందారు వద్ద నాటుకోళ్లు  - Sakshi

రాజాం: సాధారణంగా దసరా, సంక్రాంతి పండగకు నాటు కోడి ధర పెరుగుతుంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి నెలరోజులు ముందునుంచే దాని ధర పెరుగుతూ వస్తుంది. నాటు కోడికి ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వాటి పెంపకం అధికమైంది.

కరోనా లాక్‌ డౌన్‌ నుంచి..
కరోనా లాక్‌డౌన్‌ ఏర్పడిన నాటి నుంచి నాటుకోడి మాంసం, గుడ్లుపై ప్రజలు దృష్టిసారించారు. వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనా రాదని నిపుణులు తెలియజేయడంతో పాటు మాంసం, గుడ్లు, చేపలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రజలంతా నాటుకోడి మాంసం, గుడ్లు, గొర్రె మాంసంపై పడ్డారు. గొర్రె మాంసం గతంలో కిలో రూ. 700లు ఉండగా ఇప్పుడు రూ.900 నుంచి రూ.1000 మధ్య పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట వారానికి ఒకరోజు గొర్రె మాంసం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇదే కోవలో నాటుకోడికి కూడా డిమాండ్‌ పెరిగింది.

గతంలో కిలో మాంసం పడే నాటు కోడి ధర రూ.500 ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.600కు చేరింది. చికెన్‌సెంటర్ల వద్ద నాటు కోడి మాంసం రూ. 800కు విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్లకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. నాటు కోడి గుడ్లు ఇప్పుడు ఎక్కడా సాధారణంగా లభించడం లేదు. ఒక గుడ్డు ధర రూ.10 పలుకుతుంది. దీంతో గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారి సంఖ్య పెరిగింది. నాటుకోళ్లు కూడా నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో పెరుగుదలకు వచ్చి విక్రయాలకు అనువుగా మారుతుంటాయి. నాటుకోడి పెంచడం ద్వారా పల్లె ప్రాంతాల్లో ఆదాయ వనరులు పుష్కలంగా కొంతమంది రైతులకు కలిసివస్తున్నాయి.

కల్లీ మాంసం విక్రయాలు
పట్టణ ప్రాంతాల్లో పలు చికెన్‌ సెంటర్ల వద్ద బ్రాయిలర్‌తో పాటు నాటుకోడి మాంసం విక్రయాల బోర్డులు దర్శనమిస్తున్నాయి. కిలో నాటుకోడి మాంసం రూ. 600 నుంచి రూ. 800లకు విక్రయిస్తున్నాయి. ఈ మాంసంలో బ్రాయిలర్‌ కోడి మాంసం కలిపేయడం, మరికొన్ని చోట్ల క్రాస్‌ నాటుకోడి మాంసం కలిపేయడం చేస్తున్నారు. దీంతో నాటుకోడి మాంసం కల్తీకి కూడా గురవుతోంది. ఆ కల్లీ బారి నుంచి తప్పించుకునేందుకు నాటుకోడి మాంసం కావాలనుకునేవారు ఇప్పుడు పల్లెబాట పడుతున్నారు. అక్కడ కోళ్లు కొనుగోలు చేస్తున్నారు.

పెరటికోళ్ల గుడ్లతో ఉపాధి
నాటుకోడి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పెరటికోళ్ల పెంపకానికి మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 25 వేల మందికి పెరటికోళ్ల యూనిట్లు పంపిణీచేసింది. ఈ యూనిట్‌లో ఎనిమిది పెట్టలతో పాటు రెండు పుంజులు ఉంటాయి. ఈ కోళ్లు ఆరు నెలల పాటు గుడ్లు పెడుతూనే ఉంటాయి. వాటిని విక్రయిస్తున్న మహిళలకు ఆర్థిక చేయూత కూడా లభిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement