అలరించిన భక్తిగీతాలాపన | Sakshi
Sakshi News home page

అలరించిన భక్తిగీతాలాపన

Published Wed, Apr 10 2024 1:30 AM

భక్తిగీతాలాపన చేస్తున్న  భీష్మారావు బృందం - Sakshi

విజయనగరం టౌన్‌: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆవరణలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీవారి స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు సారథ్యంలో నిర్వహించిన భక్తిగీతాలాపన ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. గాయనీగాయకులు అమ్మవారిని స్తుతిస్తూ పలు కీర్తనలు ఆలపించారు. ఆలయ ఈఓ డీవీవీ.ప్రసాదరావు సంస్థ ప్రతినిధులను దుశ్శాలువాలతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పైడిమాంబ కళాపీఠం వ్యవస్థాపకుడు ఆర్‌.సూర్యపాత్రో తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు గ్రామాల్లో తోటలు దగ్ధం

వేపాడ: మండలంలోని భర్తవానిపాలెం, వేపాడ గ్రామాల్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో నీలగిరి, జీడిమామిడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి ఎస్‌.కోట అగ్నిమాపక హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీను అందించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం భర్తవానిపాలెంలో జరిగిన ప్రమాదంలో పలువురు రైతులకు సంబంధించిన నీలగిరి తోటలు, అలాగే వేపాడ రెవెన్యూలోని గుత్తివారితోటలో ఎకరా విస్తీర్ణంలో జీడిమామిడి, మామిడి మొక్కలు దగ్ధమయ్యాయని చెప్పారు.

ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్‌

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని జగ్గరాజుపేట గ్రామ శివారులో కోడి పందాల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఎస్సై రామగణేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ నిర్వహించి..గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,510 నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు అప్పగించామని చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ఇంగ్లిష్‌ స్పీకింగ్‌లో ఉచిత శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం ప్రశంసనీయమని ‘మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌’ వ్యవస్థాపకుడు, చీఫ్‌ కోచ్‌ డాక్టర్‌ ఎ.చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయని చెబుతూ.... ఆసక్తి ఉన్నవారి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్‌ కోర్సు ను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘మా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్‌ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్‌లైన్లో ఉచితంగా అందజేస్తాం’ అని చెప్పారాయన. ఈజీ ఇంగ్లీష్‌ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నా రు. ‘ఈ కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజి స్ట్రేషన్‌ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్‌ నంబర్‌కు వాట్సా ప్‌ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్‌ ఫోన్‌కు లింకును పంపిస్తాం’ అని వివరించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రి య ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.

భర్తవానిపాలెంలో   కాలిపోతున్న నీలగిరి తోటలు
1/2

భర్తవానిపాలెంలో కాలిపోతున్న నీలగిరి తోటలు

జగ్గరాజుపేటలో పోలీసుల అదుపులో 
పందెంరాయుళ్లు
2/2

జగ్గరాజుపేటలో పోలీసుల అదుపులో పందెంరాయుళ్లు

Advertisement
Advertisement