‘ఓ దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నీకు మేము ఏం అన్యాయం చేశాం.. | Sakshi
Sakshi News home page

‘ఓ దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నీకు మేము ఏం అన్యాయం చేశాం..

Published Wed, Jun 21 2023 1:30 AM

భార్య, కుమారులతో శంకర్‌ (ఫైల్‌) - Sakshi

పెద్దపల్లి : ‘ఓ దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నీకు మేము ఏం అన్యాయం చేశాం.. మా ఇంటి దిక్కును మాకు శాశ్వతంగా దూరం చేశావా.. ఇక మాకు దిక్కెవరు తండ్రీ.. అంటూ ఆ కుటుంబసభ్యులు రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధి మల్యాలపల్లె సమీపంలోని రాజీవ్‌ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. రామగుండం శివాజీనగర్‌కు చెందిన గుంజపడుగ శంకర్‌(33) రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో సెలూన్‌ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సెలవు దినం కావడంతో పనిమీద బైక్‌పై గోదావరిఖని వెళ్లాడు. తిరిగి వస్తూ కుందనపల్లి పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కొట్టించేందుకు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న సిమెంట్‌ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. అదే దారిలో వస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన వాహనాన్ని ఆపి, మృతుడి వివరాలు ఆరా తీశారు. అనంతరం ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్‌కు సమాచారం అందించారు.

మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకర్‌ మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని, కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే శంకర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సెలవు రోజున శాశ్వతంగా వెళ్లి పోయావా శంకరన్నా అని చాలా మంది కంటతడి పెట్టారు.

Advertisement
Advertisement