సర్పంచ్‌ దాడి.. చెట్టుకు కట్టేసి మరీ చితకబాదిన వైనం..? | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ దాడి.. చెట్టుకు కట్టేసి మరీ చితకబాదిన వైనం..?

Published Tue, Sep 5 2023 1:14 AM

- - Sakshi

ధర్మారం(ధర్మపురి): వీధిలో రోడ్డు నిర్మించడం లేదని చౌరస్తాలో తనను దూషించాడన్న సమాచారంతో మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌ సదరు వ్యక్తిని పంచాయతీ తాత్కాలిక సిబ్బందితో మోటార్‌ సైకిల్‌పై ఇంటికి రప్పించుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల బాగోగులు చూడాల్సిన సర్పంచే ఏకంగా ఓ వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని కొట్టడంపై గ్రామస్తులు విస్తుపోతున్నారు. ఈ ఘటనపై మండలస్థాయి అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ తెలియనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత శుక్రవారం సాయంత్రం తమ వాడలో సర్పంచ్‌ రోడ్డు నిర్మించడం లేదని గ్రామ చౌరస్తాలో దూషించినట్లు సమాచారం. విషయాన్ని స్థానికుడొకరు సర్పంచ్‌ దృష్టికి ఫోన్‌లో చేరవేశారు. నిజాలు తెలుసుకోకుండానే కోపోద్రిక్తుడైన సదరు సర్పంచ్‌.. వెంటనే పంచాయతీ తాత్కాలిక ఉద్యోగికి ఫోన్‌ చేసి సదరు వ్యక్తిని తీసుకరావాలని హుకూం జారీ చేశాడు. సదరు ఉద్యోగి ఆ వ్యక్తిని సర్పంచు ఇంటికి తీసుకొని వెళ్లడమే ఆలస్యం.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందున్న చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.

అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి కుమారుడికి ఫోన్‌ చేసి ‘మీ తండ్రిని చెట్టు కట్టేశాం..’ అని చెప్పారు. ఆందోళనకు గురైన బాధితుడి కుమారుడు తన మేనమామను వెంట తీసుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి ఉన్న తండ్రిని చూసి చలించిపోయాడు. విడిచిపెట్టాలని సర్పంచ్‌ను కోరగా ఇష్టమొచ్చినట్లు తిడితే తాము పడతామా అని సర్పంచు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సర్పంచు కాళ్లు మొక్కి.. ఇకమీదట తిట్టకుండా చూస్తామని చెప్పి తండ్రిని ఇంటికి తీసుకొచ్చారు.

మరుసటి రోజు కూడా వార్నింగ్‌..?
చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన నుంచి తేరుకోని బాధిత కుటుంబానికి శనివారం గ్రామ పంచాయతీ నుంచి పిలుపు వచ్చింది. ఓ పెద్దమనిషి ఫోన్‌ చేసి పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలని ఆదేశించగా.. మళ్లీ ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో వెళ్లిన యువకుడికి మళ్లీ క్లాస్‌ పీకారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే పోలీస్‌స్టేషన్‌లో వేయిస్తానని సర్పంచు బెదిరించినట్లు సమాచారం. అక్కడే ఉన్న మిగతావారు కూడా సర్పంచును దూషించొద్దని సూచించి పంపించినట్లు సమాచారం. ఈ విషయమై బాధితుడి కుమారుడిని వివరణ కోరగా.. తనతండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టారని, విడిపించాలని కోరితే సర్పంచుతోపాటు ఆయన కుటుంబసభ్యులు హెచ్చరించి వదిలేశారని చెప్పాడు.

Advertisement
Advertisement