విభజన హామీల అమలుకు 17 గెలవాలి | Sakshi
Sakshi News home page

విభజన హామీల అమలుకు 17 గెలవాలి

Published Wed, Jan 31 2024 3:59 AM

17 to win the implementation of partition guarantees says revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకిచ్చిన విభజన హామీలు అమలు కావాలంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలవాలని.. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ ఎన్నికల కమిటీ (పీఈసీ) భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, పీఈసీ సభ్యులు షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్, సంపత్‌కుమార్, శివసేనారెడ్డిలతో కలసి రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ భేటీలో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. 

కేసీఆర్‌ అడిగింది లేదు.. మోదీ ఇచ్చింది లేదు.. 
‘విభజన హామీల్లో పొందుపర్చిన అంశాలను సాధించుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ గెలవాలి. దీనిపై పదేళ్లు కేసీఆర్‌ అడిగింది లేదు... మోదీ ఇచ్చింది లేదు’అని రేవంత్‌ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే ప్రధాని మోదీ రూ. 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని ప్రపంచంలోనే దివాలా తీసిన దేశంగా నిలబెట్టారని ఆరోపించారు. అందువల్ల రాహుల్‌ గాంధీ లాంటి నాయకుడు ప్రధానిగా ఉండాల్సిన అవసరముందని రేవంత్‌ పేర్కొన్నారు. 

బీజేపీతో బీఆర్‌ఎస్‌ చీకటి చర్చలు.. 
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చీకట్లో మోదీతో జరుపుతున్న చర్చలను, బిల్లా–రంగాలు (కేటీఆర్, హరీశ్‌లను ఉద్దేశించి) మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు గమనించి కాంగ్రెస్‌కు అండగా నిలవాలని రేవంత్‌ కోరారు.

‘అధికారం నుంచి దింపాల్సింది మోదీనైతే బిల్లా–రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్‌ ఉండటమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అధికారంలోకి వచ్చేది మోదీనే కదా? ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా?’అని ప్రశ్నించారు. 

కోదండరాంను అలాంటి వాళ్లతో పోలుస్తారా? 
ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేస్తామంటే రాజకీయ కుట్రతో వాయిదా వేయించే ప్రయత్నం చేశారని రేవంత్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతల దొడ్లో చెప్పులు మోసేవాళ్లతో ప్రొఫెసర్‌ కోదండరాంను పోల్చడంలో అర్థముందా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కైనా అపాయింట్‌మెంట్‌ ఇస్తా.. 
తనను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలవడంపై సీఎం రేవంత్‌ స్పందించారు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా సీఎంగా అపాయింట్‌మెంట్‌ ఇస్తానని, అవసరమైతే కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు కూడా తనను అపాయింట్‌మెంట్‌ అడగొచ్చన్నారు. ఒకవేళ తాను ఆ సమయంలో అందుబాటులో లేకపోతే ఉపముఖ్యమంత్రిని కలవచ్చని చెప్పారు. 

రాజ్యసభ అభ్యర్థుల ఖరారు బాధ్యత ఖర్గేకు.. 
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీకి బదిలీ చేస్తూ పీఈసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రేవంత్‌ చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ రాష్ట్రానికి వచ్చి దరఖాస్తులపై చర్చించి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుందని, ఈ నెల 15–20లోగా సమావేశాలు జరుగుతాయన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకొనే అవకాశముందని చెప్పారు.  

కనీవిని ఎరగని రీతిలో ఇంద్రవెల్లి సభ 
ఫిబ్రవరి 2న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 
టీపీసీసీ నేతల సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ఫిబ్రవరి 2న కనీవినీ ఎరగని రీతిలో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ బహిరంగసభపై మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇంద్రవెల్లి స్తూపం వద్ద స్మృతి వనం కడతామని సీఎం చెప్పారన్నారు.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి ప్రచారం కార్యక్రమం మొదలైందని గుర్తు చేశారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడు తూ ఇంద్రవెల్లిలో సీఎం పలు అభివృద్ధి కార్య క్రమాలు ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నేతలు మోత్కుపల్లి నర్సింహులు, హరివర్ధన్‌రెడ్డి, శ్రీహరిరావు, డీసీసీ అధ్యక్షులు, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement