వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకపోతున్నాం..  | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకపోతున్నాం.. 

Published Sat, Apr 13 2024 4:55 AM

The alliance leaders are in disarray - Sakshi

మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా? 

కూటమి నేతల తర్జనభర్జన  

హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు 

కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా దిగుతున్నా వైఎస్సార్‌సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలను ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపైనే చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడంలేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్లుగా రావడంలేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితిలేదని మూడు పార్టీల నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్‌సింగ్, అరుణ్‌సింగ్‌లు సమావేశమై పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఇటీవల గోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా నిర్వహించిన సభలకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని బీజేపీ ముఖ్యులు అన్నట్లు సమాచారం.

విడివిడిగా సభలు పెడితే అసలు జనం రావడంలేదని, ఉమ్మడిగా పెట్టినా ఫలితం ఉండడంలేదని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఉమ్మడి సభలు ఎక్కువగా నిర్వహిద్దామని, వాటికి జనాన్ని ఎక్కువగా సమీకరించాల్సి వుందని సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాల్సి వుందని, ఇప్పటికే ప్రాథమికంగా దీన్ని రూపొందించామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.  

వైఎస్సార్‌సీపీ నేతలపై చర్యలు తీసుకునేలా చూడండి.. 
ఇక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అన్ని స్థాయిల్లో భారీగా ఫిర్యాదులు  చేయిస్తామని, వాటిపై చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన బీజేపీ పరిశీలకులను కోరినట్లు సమాచారం. అలా చేయడంవల్ల అధికార పార్టీ కేడర్‌ను కొద్దిగానైనా నిలువరించవచ్చనే అభిప్రాయం చంద్రబాబు వ్యక్తంచేసినట్లు తెలిసింది. అలాగే, ప్రకటించిన సీట్లలో కొన్నింటిని మార్చాలనే దానిపైనా చర్చ జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అభ్యర్థిని మార్చాలని ఈ సమావేశంలో బీజేపీని కోరారు. అక్కడ ప్రస్తుతమున్న బీజేపీ అభ్యర్థి శివకృష్ణంరాజు స్థానంలో అక్కడి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డినిగానీ లేకపోతే ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరిని బీజేపీలో చేర్చి వారికి సీటు ఇవ్వాలని ప్రతిపాదించారు లేకపోతే ఈ సీటును బీజేపీ వదిలేస్తే మరో స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని సీట్లపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు.  

అనపర్తిపై ఢిల్లీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం.. 
ఇదిలా ఉంటే.. అనపర్తితో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమిలో తలెత్తుతున్న ఇబ్బందులపై త్వరలో తమ పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.

ఈ ఉమ్మడి సమావేశానంతరం ఆమె విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి నియోజకవర్గంలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థిని కూడా టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోనీయకుండా అడ్డుకోవడంపై విలేకరుల  ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. అనపర్తి  విషయం మాత్రమే కాకుండా ఎక్కడైతే  ఇలాంటి ఇబ్బందులున్నాయో వాటన్నింటిపై ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు.

పొత్తుల్లో చిన్నచిన్న లోపాలు ఎక్కడైతే తలెత్తుతున్నాయో, వాటన్నింటినీ ఎలా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని అన్న దానిపైన ఈ సమావేశంలో చర్చించామన్నారు. అలాగే, పైస్థాయిలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో బూత్‌ వరకు కార్యకర్తలు ఎలా సమన్వయంతో పనిచేయాలన్న దానిపై చర్చించామన్నారు.    

Advertisement
Advertisement