Sakshi News home page

మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి.. ఓట్లు, అధికారం కోసం కాదు!

Published Thu, Aug 3 2023 6:11 PM

Amit Shah Slams India Over Supports AAP Objects Delhi Ordinance Bill - Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ  విపక్ష కూటమి ఇండియాపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును తప్పుబట్టారాయన. 

ఢిల్లీ ఆర్డినెన్స్‌(సవరణ) బిల్లు-2023 రాజ్యాంగ బద్ధమే. కేంద్రానికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు ఆర్డినెన్స్‌ ప్రకారమే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్‌ దీనిని వ్యతిరేకిస్తోంది. దానికి కూటమి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి. ఓట్లు, అధికారం కోసం కాదు. కూటమి కోసం కాదు.. ఢిల్లీ కోసం ఆలోచించండి. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాల్ని వ్యతిరేకించొద్దు అంటూ విపక్షాలకు చురకలటించారాయన. 

2015లో సేవ చేయాలనే ధ్యాస లేని ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే.. విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నియంత్రణ కోసం వాళ్లు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకంటే బంగ్లాల కట్టడం లాంటి అవినీతిని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి.. అని ఆప్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన.

నెహ్రూను నేనేం పొగడలే!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గురువారం లోక్‌సభ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ..  భారత సమాజ వ్యవస్థాపకులైన జవహార్‌లాల్‌ నెహ్రూ, సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, సీ రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్‌, బీఆర్‌ అంబేద్కర్‌లు.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినవాళ్లే అని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తోంది నిజమేనా?. ఇది పగలా లేక రాత్రా?.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన(అమిత్‌ షా) నోట్లో లడ్డూ పెట్టాలని ఉంది. ఎందుకంటే అమిత్‌ షా నెహ్రూను, కాంగ్రెస్‌ను పొగిడారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. 

ఆ వెంటనే షా జోక్యం చేసుకని.. తానేం నెహ్రూని పొగడలేదని స్పష్టత ఇచ్చారు. ‘‘పండిట్‌ నెహ్రూను నేను పొగడలేదు. ఆయన ఏం చెప్పారో.. అదే ప్రస్తావించా. దానిని వాళ్లు పొగడ్తగా భావిస్తే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని బదులు ఇచ్చారు. దీంతో రంజన్‌ మరోసారి జోక్యం చేసుకుని షా వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాట్లాడారు. 

Advertisement
Advertisement