Angkita Dutta allegations on IYC president Srinivas BV - Sakshi
Sakshi News home page

ఏం మందు తాగుతావ్? అని అడిగాడు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై మహిళా నేత సంచలన ఆరోపణలు

Published Wed, Apr 19 2023 2:23 PM

Angkita Dutta Allegations ON IYC president Srinivas - Sakshi

దిస్పూర్‌: కాంగ్రెస్ యూత్ వింగ్(ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేశారు అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్‌కితీ దత్తా. ఆయన తనను ఆరు నెలలుగా వేధిస్తున్నాడని తెలిపారు. ఏం మందు తాగుతావ్, వొడ్కానా లేక టెకీలానా? అంటూ సందేశాలు పంపాడని చెప్పారు. జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ నేతపై ఇలాంటి ఆరోపణలు చేయడం హస్తం పార్టీలో దుమారం రేపింది.

అంగ్‌కితా దత్తా అసోం యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే అప్పటి అధ్యక్షుడు బీజేపీలో చేరడంతో ఈమెకు ఆ అవకాశం లభించింది. కానీ ఉన్నట్టుండీ ఈమెను బీవీ శ్రీనివాస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీంతో అసలు ఏం జరిగిందో ఆమె వివరించారు.

యూత్ కాంగ్రెస్ అసోం కార్యదర్శి వర్ధన్ యాదవ్‌ ద్వారా కూడా బీవీ శ్రీనివాస్‌ తనను అవమానించే వారని అంగ్‌కితా ఆరోపించారు. తన గురించి చులకనగా మాట్లాడేవారని చెప్పారు. అవినీతి చరిత్ర ఉన్న వర్ధన్‌కు అసలు ఆ పదవి ఎలా ఇచ్చారో అర్థంకావడం లేదన్నారు.  ఓ కేసులో అతడు తిహార్ జైలుకు కూడా వెళ్లాడని చెప్పారు.

వర్ధన్ తనతో అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని బీవీ శ్రీనివాస్‌కు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన కూడా మెసేజ్‌లో అభ్యంతరకర సందేశాలు పంపేవారన్నారు. బీవీ శ్రీనివాస్ గురించి భారత్‌ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లానని, అప్పటి నుంచి శ్రీనివాస్‌ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే అంగ్‌కితా ఆరోపణలను కాంగ్రెస్ యూత్ వింగ్ ఖండించింది ఆమె బీజేపీతో టచ్‌లో ఉందని చెప్పింది. తన ఆరోపణలు తప్పు అయితే విచారణకు పిలవచ్చు కదా? అని అంగ్‌కితా అన్నారు. బీవీ శ్రీనివాస్ సందేశాలు తన వద్ద ఉన్నాయన్నారు. అలాగే తాను సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసినట్లు కూడా ఆమె అంగీకరించారు. ఓ మెంటల్ హెల్త్‌ కేర్‌ ప్రాజెక్టు కోసమే ఆయనతో సమావేశమైనట్లు తెలిపారు.  దీన్ని అదునుగా తీసుకుని బీవీ శ్రీనివాస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..

Advertisement
Advertisement