గెలుపు గుర్రాలపై ఫోకస్‌! | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాలపై ఫోకస్‌!

Published Tue, Aug 15 2023 2:16 AM

Assembly elections: Congress begins candidate selection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా మార్గదర్శకాలను సిద్ధం చేయడంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు సోమవారం గాందీభవన్‌లో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ నేతృత్వంలో బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్‌ మేవానీల సమక్షంలో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరిగింది.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఈసీ సభ్యులు బలరాం నాయక్, రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్‌ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మన్సూర్‌ అలీఖాన్, వంశీచంద్‌రెడ్డి, శివసేనారెడ్డి, సంపత్‌కుమార్, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, సునీతారావు తదితరులు ఇందులో పాల్గొని చర్చించారు. 

18 నుంచి దరఖాస్తులు 
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించాలని పీఈసీ సమావేశం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గాందీభవన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు.. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు.

ఇక దరఖాస్తు రుసుము కింద ఓసీల నుంచి రూ.10 వేలు, ఇతర వర్గాల నుంచి రూ.5వేలను డీడీ రూపంలో తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడినా.. ఓసీలకు రూ.50 వేలు, ఇతరులకు రూ.25 వేలుగా ఫీజును ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజు ఎంతన్నది సబ్‌కమిటీ ఖరారు చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ముగిశాక సెప్టెంబర్‌ మొదటివారంలో మరోమారు సమావే శం కావాలని.. మూడో వారానికల్లా తొలి విడత జాబితా సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు.

ఆశావహులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే.. పార్టీలో అనుభవం, గత నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాలను వివరించాలని పేర్కొననున్నట్టు తెలిసింది. బీసీలకు ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో కనీ సం 2 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా కేటాయించాలనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ మూడో వారంలో తొలి జాబితా ప్రకటిస్తామని, అభ్యర్థుల ఖరారులో సామాజిక న్యాయాన్ని పాటిస్తామని చెప్పారు. 

అడిగిన అందరికీ టికెట్లివ్వడం కుదరదు: మహేశ్‌కుమార్‌గౌడ్‌ 
పీఈసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు.పార్టీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే అందరికీ టికెట్లు ఇవ్వడం కుదరనందున సర్వేలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఒక్క సర్వేలు మాత్రమే ఆధారం కాదని, పీఈసీ అనేక అంశాల్లో వడపోత చేపట్టి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుందని వివరించారు. ఆ జాబితాలను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకుని టికెట్లను ప్రకటిస్తారని చెప్పారు.  

రేవంత్‌ వర్సెస్‌ పొన్నాల 
పీఈసీ సమావేశం అనంతరం ఏఐసీసీ గదిలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. వరంగల్‌ జిల్లా రాజకీయాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తాను చాలా కాలం నుంచి కోరుతున్నా.. సమయం ఇవ్వడం లేదని, ఇష్టారాజ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నారని పొన్నాల ప్రశ్నించినట్టు సమాచారం.దీంతో వరంగల్‌లో జరిగిన సమావేశానికి పొన్నాల వచ్చి మాట్లాడి ఉండాల్సిందని రేవంత్‌ పేర్కొన్నట్టు తెలిసింది.

దీనిపై పొన్నాల ఆగ్రహంగా స్పందిస్తూ.. ఎవరు పిలిచారని వరంగల్‌ మీటింగ్‌కు రావా­లని నిలదీశారని, బీజేపీలోకి వెళ్లాలని చూసిన నాయకులను తీసుకొచ్చి అందలం ఎక్కించారని మండిపడినట్టు సమాచారం. పార్టీలో 45 ఏళ్లుగా పనిచేస్తున్న తమ లాంటి నేతలకు కనీస మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తే ఎలా­గని నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుదామంటూ మాణిక్‌రావ్‌ ఠాక్రే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. తానేమీ అబద్ధం చెప్పడం లేదని, పీసీసీ అధ్యక్షుడి ముందే అన్నీ ప్రస్తావిస్తు న్నానని పొన్నాల గట్టిగా మాట్లాడినట్టు సమాచారం. 

Advertisement
Advertisement