కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Published Sat, Apr 15 2023 3:43 AM

Bandi Sanjay in Ambedkar Jayanti celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నేళ్లుగా రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.గతంలో ఈ కార్యక్రమాలకు హాజ­రుకాకుండా అంబేడ్కర్‌ను అవమానించిన కేసీఆర్‌ ఎన్నికలొస్తున్నాయని ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. అలాగే, రూ.కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సంజయ్, ఇతరనేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. ‘దళితబంధు దేశానికి దిక్సూచి అంటూ ఇచ్చిన ప్రకటనలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత­మందికి దళితబంధు ఇచ్చారో, ఎవరెవరికి ఇ­చ్చారో చెప్పాలి. దీనిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని అన్నారు. అంబేడ్కర్‌ను, దళితులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌కు అంబే­డ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించే అర్హత లేదన్నారు.

‘తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడినే తొలి సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమ­లు చేయలేదు. దళితులకు మూడెకరాలు ఎందుకివ్వలేదు? దళితుల పేరిట ఉన్న జాగాలను ఎందు­కు లాక్కుంటున్నారు? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ నిధులివ్వకుండా పేదలకు విద్య, వైద్యా­న్ని ఎందుకు దూరం చేస్తున్నారు?’ అంటూ కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. వీటికి సమాధానాలు ఇవ్వలేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు.

అణగారిన వర్గాల దిక్సూచి అంబేడ్కర్‌ అని ఐక్యరాజ్యసమితి చెప్పిందంటే అంబేడ్కర్‌ గొప్పతనం అర్ధం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నేతలు బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కొప్పు బాషా, మాజీ డీజీపీ క్రిష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. కాగా, ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి సంజయ్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. 

మహాశయా... మన్నించు... 
‘అంబేడ్కర్‌ మహాశయా... మాట ఇస్తున్నా. 2023లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారంలోకి వచ్చాక మీ ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని పార్టీపక్షాన హామీ ఇస్తున్నా’ అని అంబేడ్కర్‌ను ఉద్దేశించి బండి సంజయ్‌ లేఖ రాశారు. ‘మహాశయా... మన్నించు.. మీ వంటి చారిత్రక వ్యక్తి విగ్రహాన్ని దళిత ద్రోహి ప్రారంభించడం బాధగా ఉంది. మీరు రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ మిమ్మల్ని అవమానించినోళ్లే ఓట్ల కోసం మీ జపం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వం ధారపోసిన మహనీయుడు మీరు. అందరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి మీరు. అలాంటి మీ విగ్రహం వద్దే ఓట్ల రాజకీయ క్రీడను మొదలుపెట్టడం బాధగా ఉందన్నారు. ౖ‘2024లో కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ మీ విగ్రహం సాక్షిగా చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌. తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌ ఇంకా పగటి కలలు కంటున్నారు’ అని ఎద్దేవాచేశారు. ‘నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తున్నోళ్లే మీ సిద్ధాంతం గొప్పదని బాకాలు కొడుతున్నారని ధ్వజమెత్తారు.  

Advertisement
Advertisement