Sakshi News home page

ఈ రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం

Published Mon, May 15 2023 3:34 AM

 Bandi Sanjay rally started at Vaishya Bhavan in Karimnagar  - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని, మరో ఐదు నెలల్లో ఈ పాలనను పాతరేసి రామరాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలతో హిందుత్వంపై కొన్ని శక్తులు విష ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు. హిందూ ఏక్తాయాత్ర సందర్భంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని వైశ్యభవన్‌ వద్ద మొదలైన ర్యాలీలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో కలసి బండి సంజయ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా హిందూ ఏక్తాయాత్ర చేయడం లేదని, హిందూ సమాజాన్ని సంఘటిత పర్చేందుకు, ఐక్యంగా ఉంచేందుకే చేపట్టానని తెలిపారు. కుహానా లౌకికవాదుల నుంచి హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సి ఉందన్నారు. ఈ యాత్రతో రాష్ట్రమంతా హిందూ సమాజాన్ని జాగృతపరుస్తానని చెప్పారు.

పావు గంటపాటు పోలీసులు తప్పుకుంటే తామేంటో చూపిస్తామన్న వారిని పరుగులు పెట్టించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి చెందగానే.. హిందూత్వానికి మనుగడ లేదని కొన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయని.. అలాంటి వారంతా ఒక్కసారి కరీంనగర్‌ గడ్డ వైపు చూస్తే సమాధానం దొరుకుతుందన్నారు. దేశంలో హిందుత్వం లేకపోతే ఎప్పుడో పాకిస్తాన్‌ అయ్యేదన్నారు. నిజాం రజకార్ల సమా ధుల వద్ద మోకరిల్లిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు.  

ఎగిరేది కాషాయ జెండానే.. 
జగిత్యాల ఎస్సై భార్యకు, బురఖా వేసుకున్న మహిళకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఎంఐఎం నేతలు అకారణంగా జోక్యం చేసుకుని సదరు ఎస్సైని సస్పెండ్‌ చేయించారని సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది కాషాయం జెండానే అని చెప్పారు. కేరళ స్టోరీ సినిమాలో హిందూ మహిళలపై జరుగుతున్న లవ్‌ జిహాద్‌ దాడులను కళ్లకు కట్టారని పేర్కొన్నారు. 

త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతి: హిమంత బిశ్వశర్మ 
రాష్ట్రంలో రజాకార్ల ప్రభుత్వం పోయి, త్వరలోనే రామరాజ్యం వస్తుందని తనకు నమ్మకంగా ఉందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం దేశంలో సనాతన ధర్మం బతికే ఉంటుందన్నారు. పదేళ్ల క్రితం దేశంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టీకల్‌ 370 రద్దును ఎవరూ ఊహించలేదని.. కానీ అవన్నీ సాకారం అయ్యాయని చెప్పారు.

కొందరు నాలుగు పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కంటున్నారని.. కానీ త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతితో వాటికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేస్తారన్నారు. అసోంలో డీజిల్‌ ధర రూ.97 ఉంటే తెలంగాణలో మాత్రం రూ.106గా ఉందన్నారు. తెలంగాణ సర్కారు ఉద్యోగాలను కూడా సరిగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ నేతల పేర్లు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో వినిపిస్తున్నాయన్నారు.

బండి సంజయ్‌ హనుమంతుడిలా యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను సీఎం అయ్యాక అసోంలో పలు మదర్సాలను రద్దు చేశానని, మరికొన్నింటిని రద్దు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఐదు నెలలు శక్తివంచన లేకుండా కృషి చేస్తే.. తెలంగాణలో అధికారం మనదేనని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement