కవిత,కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం!  | Sakshi
Sakshi News home page

కవిత,కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం! 

Published Sat, Apr 8 2023 4:29 AM

Bandi Sanjay Sensational Comments on CM KCR Family - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  సీఎం కేసీఆర్‌ కుటుంబంలోనే పరీక్ష పేపర్ల లీకు వీరులు, ప్రజలకు తాగించే లిక్కర్‌ వీరులు ఉన్నారని.. సీఎం కుమార్తె కవిత లిక్కర్‌ స్కాంలో, డ్రగ్స్‌ కేసులో కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే తనపై కక్షగట్టి, పథకం ప్రకారం పదో తరగతి పేపర్‌ లీకేజీలో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

తనపై పీడీ యాక్ట్‌ పెట్టాలంటున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎంతో మంది మరణాలకు కారణమని.. వాస్తవానికి వారిపైనే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పదో తరగతిపేపర్‌ లీక్‌ కేసులో రిమాండ్‌ అయిన బండి సంజయ్‌.. శుక్రవారం ఉదయం 9 గంటలకు కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ నాశనమైతుంటే సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదేమని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలోనే వరంగల్‌లో భారీఎత్తున నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.  

వారిపైనే కేసులు పెట్టాలి.. 
తనపై పీడీ యాక్ట్‌ పెట్టాలంటున్న మంత్రి హరీశ్‌రావుపై హత్యానేరం కేసు పెట్టాలని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ఆత్మాహుతి చేసుకునేందుకు అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీశ్‌రావు అని ఎద్దేవాచేశారు. ఆయన ధోరణితోనే 1,400 మంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు.

అయితే కేటీఆర్‌ను సీఎం చేస్తే ముందు పార్టీ మారే జంప్‌ జిలానీ హరీశ్‌రావేనని ఎగతాళి చేశారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుమార్తె కవిత లిక్కర్‌ స్కాంలో జైలుకు వెళ్లడం ఖాయమని.. త్వరలో కేటీఆర్‌ కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. 

పోలీసుల తీరు సరికాదు.. 
కొందరు పోలీసులు పోస్టింగులు, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ‘‘అసలు పదో తరగతి పేపర్‌ను ఎవరో షేర్‌ చేస్తే నాకేం సంబంధం? ప్రభుత్వం, పోలీసుల చేతగానితనాన్ని మాపై నెడతారా? వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ రంగనాథ్‌ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలి. కరీంనగర్, వరంగల్‌ పోలీసులపై పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తా..’’ అని పేర్కొన్నారు.

తన సెల్‌ఫోన్‌ ఎక్కడుందో తనకే తెలియదని, టెక్నాలజీలో ఘనులమని చెప్పుకునే పోలీసులు అందులో ఏముందో తెలుసుకోలేరా? అని ప్రశ్నించారు. ఇక కమలాపూర్‌ పేపర్‌ లీకేజీలో బాలుడిని ఐదేళ్లపాటు డీబార్‌ చేయడాన్ని బండి సంజయ్‌ తప్పుబట్టారు. పేపర్‌ లీకేజీకి బాధ్యులను గుర్తించకుండా అమాయక విద్యార్థి భవిష్యత్‌ను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. 

సంజయ్‌కు అమిత్‌షా ఫోన్‌ 
జైలు నుంచి విడుదలైన సంజయ్‌కు కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్‌ నేతలు ఫోన్‌ చేసి పరామర్శించారు. పోరాటం ఆపవద్దని.. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
 
సీఎంకు సభకు వస్తే గజమాల వేస్తాం 
రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని సభకు సీఎం కేసీఆర్‌ రావాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ వస్తే గజమాల వేసి, శాలువా కప్పి సన్మానం చేస్తామన్నారు. రాకుంటే మాత్రం కేసీఆర్‌ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. 
 

Advertisement
Advertisement