నాడు టీవీ యాంకర్‌.. నేడు అసెంబ్లీ స్పీకర్‌! | MLA Baryl Vanneihsangi Makes History As Mizoram First Woman Speaker, Know About Her Details - Sakshi
Sakshi News home page

Mizoram First Woman Speaker: నాడు టీవీ యాంకర్‌.. నేడు అసెంబ్లీ స్పీకర్‌!

Published Sat, Mar 9 2024 4:45 PM

Baryl Vanneihsangi Makes History As Mizoram First Woman Speaker - Sakshi

Mizoram First Woman Speaker : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటి సారిగా ఓ  మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్‌లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు.

మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు.

మిజోరాం మొదటి మహిళా స్పీకర్
బారిల్ వన్నెహసాంగి మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుండి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement
Advertisement