ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు: మార్గాని భరత్‌

9 Aug, 2022 13:42 IST|Sakshi

న్యూఢిల్లీ: పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో స్పష్టం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు. ఈమేరకు ఎంపీ భరత్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసే దిశగా వారి చర్యలు ఉన్నాయి. టీడీపీకి రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రజల గురించి పట్టడం లేదు. చంద్రబాబు అనాలోచిత పనుల వల్లే పోలవరం ఆలస్యమవుతోంది. కాఫర్ డ్యాం కట్టకుండా ఈసిఆర్ఎఫ్ డ్యాం కట్టడం క్షమించరాని నేరమని అన్నారు. 

'గోరంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే పార్టీ పరంగా చర్యలు తప్పవు. ఆయనపై ఎవరు ఫిర్యాదులు కూడా చేయలేదు. నైతికంగా చర్యలు తీసుకునేందుకు మేము ఇప్పటికే నివేదిక ఇవ్వాలని కోరాం. ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్‌ వీడియో. అది నిర్దారణ జరగకుండా ఏం మాట్లాడతాం. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పార్లమెంట్‌లో కోరాం. పామాయిల్ ఉత్పత్తులు దేశంలో సాగయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నాం. 76 శాతం మందికి జాతీయ ఆహార భద్రతా కింద బియ్యం ఇవ్వాలి. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు అనడంలో నిజం లేదు. రూ.6,600 కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని డబ్బు వచ్చేలా చూడాలి. ఏపీకి 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలి' అని ఎంపీ భరత్‌ కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. 

చదవండి: (World Tribal Day: ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు)

మరిన్ని వార్తలు