ప్రజల సొమ్ము దోచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం | Sakshi
Sakshi News home page

ప్రజల సొమ్ము దోచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం

Published Fri, Apr 28 2023 3:04 AM

Bhatti Vikramarka fires on kcr family  - Sakshi

కాజీపేట: ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపాదన కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురికే దక్కుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. భట్టి చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామం నుంచి ప్రారంభమై వేలేరు మండల కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబమే ప్రభుత్వ నిధులను దోపిడీ చేస్తూ ధనికరాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం పేరుతో దేశంలో ఎక్కడాలేని దోపీడీకి సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా తెరలేపారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుంట్ల దోపిడీ తతంగంపై సమగ్రమైన విచారణ జరిపించి ప్రతిపైసాను వడ్డీతోసహా వసూలు చేస్తామన్నారు.

‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేవు, నీళ్లు రావడంలేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఇళ్లులేవు, రేషన్‌ కార్డుల మంజూరులేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేలా చిత్తశుద్ధితో పనిచేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రూ.500లకు గ్యాస్, రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, రేషన్‌ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువుల పంపిణీ, కూలీబంధు పేరుతో ఏడాదికి రూ.12 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఇంటింటికీ తిరిగి కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement