రజాకార్ల పాలనను తలపిస్తున్నారు | Sakshi
Sakshi News home page

రజాకార్ల పాలనను తలపిస్తున్నారు

Published Mon, Aug 15 2022 1:22 AM

BJP Chief Bandi Sanjay Calls TRS MLAs Ministers Licensed Goons - Sakshi

మోత్కూరు/ సాక్షి, యాదాద్రి/ హైదరాబాద్‌: రాష్ట్రంలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లైసెన్స్‌డ్‌ గూండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతూ రజాకార్ల పాలనను తలపిస్తున్నారన్నారు. హత్యలు, అత్యాచారాలకు టీఆర్‌ఎస్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని ధ్వజమెత్తారు. పదిహేను రోజుల్లో ఇద్దరు లాయర్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హతమార్చారని ఆరోపించారు. తక్షణమే అడ్వొకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను తేవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

శాంతిభద్రతల్లో సర్కారు విఫలం 
శాంతి భద్రతల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయ్యిందని సంజయ్‌ విమర్శించారు. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, ఇసుక.. డ్రగ్స్‌ మాఫియాలకు టీఆర్‌ఎస్‌ నిలయంగా మారిందని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పార్టీగా బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో యాత్ర ప్రముఖ్‌ జి.మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జనగామ జిల్లాలోకి యాత్ర 
సంజయ్‌ పాదయాత్ర ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగిసి.. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోకి ప్రవేశించింది.  నల్లగొండ జిల్లాలో సంజయ్‌ 12 రోజుల పాటు 153.3 కి.మీ. నడిచారు. 5 గ్రామసభలు, 10 బహిరంగ సభలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో.. 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా దాదాపు 160 కిలోమీటర్లు సాగే పాదయాత్ర 12 రోజుల పాటు కొనసాగనుంది. పలు చారిత్రక ప్రదేశాలతో పాటు తెలంగాణ పోరాట యోధులు జన్మించిన ప్రాంతాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా ఐనవోలు మల్లన్న, వెయ్యి స్తంభాల గుడితో పాటు భద్రకాళి అమ్మవారి ఆలయాలను సంజయ్‌ సందర్శించనున్నారు.  

Advertisement
Advertisement